ఎదులాపురం, సెప్టెంబర్ 3 : గణేశ్, మిలాద్ ఉన్ నబి వేడుకలను శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ మత సంఘాల పెద్దలు, పోలీసు, రెవెన్యూ, విద్యుత్, ఎక్సైజ్, మున్సిపల్, ఫైర్, నీటి పారుదల శాఖల అధికారుతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా హిందూ, ముస్లిం మత పెద్దల అభిప్రాయాలు, సలహాలు, సూచలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 7వ తేదీ నుంచి 11 రోజులపాటు జరిగే వినాయక నవరాత్రి వేడుకలు, ఈనెల 17వ తేదీన జరిగే మిలా ఉన్ నబి వేడుకలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా చర్యలు చేపట్టాలని, గుంతలు పూడ్చాలని, మున్సిపల్ శాఖ శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని, మొబైల్ టాయిలెట్స్ నిమజ్జనం రోజు ఏర్పాటు చేయాలని, పిచ్చి మొక్కలు తొలిగించాలని, బ్లీచింగ్ పౌడర్ ఏర్పాట్లు చేయాలని, అత్యవసర పరిస్థితుల్లో టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.
విద్యుత్ శాఖ ద్వారా సీఎం ఆదేశాల మేరకు ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరుగుతుందని, 9440811700 నంబర్‌కు కాల్ చేసి సమస్యలను పరిష్కరించుకోవచ్చని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ సెక్యూరిటీ ఏర్పాటు, పెట్రోలింగ్ మూడు షిఫ్టులుగా ఏర్పాటు చేయడం జరుగుతుందని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్‌కుమార్, జీవకర్రెడ్డి పాల్గొన్నారు.