వాంకిడి, ఆగస్టు 6 : అధికారులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించవద్దని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. మంగళ వారం వాంకిడిలోని హనుమాన్ బస్తీలో పర్యటించి పారిశుధ్య పనులను పరిశీలించారు. రోడ్లపై గుంతల్లో వర్షపు నీరు నిలిచి ఉండడంతో మొరం వేయించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. ఇండ్ల పరిసరాల్లో మురుగునీరు, చెత్తా చెదారం నిల్వతో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ప్రజలకు వివరించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. అంతకుముందు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీపీవో భిక్షపతి, మండల అధికారులు తహసీల్దార్ రియాజ్ అలీ, ఎంపీడీవో నస్తులాఖాన్, ఏపీవో ఖాజా అజిజునొద్దీన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
డ్రగ్స్ నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలి
ఆసిఫాబాద్ టౌన్, ఆగస్టు 6 : జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం, విక్రయం, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. మాదకద్రవ్యాల నియంత్రణపై వైద్య, పోలీస్, వ్యవసాయ, రెవెన్యూ, ఆబారీ-మధ్య నిషేధ, విద్య, డ్రగ్స్ సంబంధిత శాఖల అధికారులు, అదనపు ఎస్పీ ప్రభాకర్ రావు, ఆసిఫాబాద్, కాగజ్ నగర్ ఆర్డీవోలు లోకేశ్వర్ రావు, సురేశ్‌తో కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాపై నియంత్రణకు విసృ్తత స్థాయిలో తనిఖీలు నిర్వహించాలని తెలిపారు.
వ్యవసాయ శాఖ పరిధిలో అన్ని గ్రామాల్లో గంజాయి సాగుపై పర్యవేక్షించాలన్నారు. జిల్లా, మండల, గ్రామస్థాయిల్లో అధికారులతో కమిటీలు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టి నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. డ్రగ్స్‌తో కలిగే నష్టాలపై కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు. విద్యార్థుల అసాధారణ ప్రవర్తనను ఉపాధ్యాయులు గమనించాలని తెలిపారు. ఏదైనా సమాచారం ఉంటే డయల్ 100 లేదా 14416 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో తుకారాం భట్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి భాసర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.