జైపూర్, మార్చి 11 : విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ కుమార్‌దీపక్ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. జూనియర్ కళాశాల భవనాన్ని పరిశీలించారు. అనంతరం పదో తరగతి విద్యార్థినులతో మాట్లాడారు. ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలని సూచించారు. అనంతరం వసతిగృహ వంట గదులను పరిశీలించారు. మెనూ ప్రకారం నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించాలని సిబ్బందికి సూచించారు.
అనంతరం రసూల్‌పల్లి, నర్వ, టేకుమట్ల, కిష్టాపూర్ గ్రామాల గుండా నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ రహదారి పనుల పురోగతిని పరిశీలించారు. టేకుమట్ల వద్ద రైతులతో మాట్లాడారు. భూసేకరణ వేగవంతం చేసి రోడ్డు పనులు ప్రారంభించాల్సిన సమయంలో రైతులు పంటలు వేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
పరిహారం డబ్బుల పరిష్కారం తేలాకే పంటలు వేయడం ఆపుతామని రైతులు కలెక్టర్‌తో మొరపెట్టుకున్నారు. హైవే నిర్మాణంలో ప్రభుత్వం రైతులకు ఇస్తున్న పరిహారంపై సంతృప్తి చెందని టేకుమట్ల రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కలెక్టర్ వెంట తహశీల్దార్ వనజారెడ్డి, ఎంపీడీవో సత్యనారాయణ, ఎంపీవో బాపురావు ఉన్నారు.
మంచిర్యాల అర్బన్, మార్చి 11 : రాజీవ్‌నగర్‌లో గల కేజీబీవీ పాఠశాలలోని 20 మంది విద్యార్థులకు కలెక్టర్ కుమార్ దీపక్ చేతుల మీదగా కళ్లద్దాలు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 568 పాఠశాలలు, 164 రెసిడెన్షియల్ పాఠశాలల్లో 8 ఆర్బీఎస్కే బృందాల ద్వారా కంటి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. 1274 మంది విద్యార్థులు కంటి సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించామని, వీరికి కంటి వైద్య నిపుణులు యశ్వంతరావు, చంద్రబోస్, శిల్ప, ఆప్తాల్మిక్ అధికారులు శంకర్.
భాసర్ రెడ్డి పరీక్షలు నిర్వహించారని, ఆ మేరకు 1241 మంది విద్యార్థులకు అద్దాలు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీశ్‌రాజ్, ఉపజిల్లా వైద్యాధికారి డాక్టర్ అనిత, నోడల్ ఆఫీసర్ డాక్టర్ యశ్వంతరావు, జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్ ప్రసాద్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కృపాబాయి, వైద్యాధికారులు డాక్టర్ అశోక్, డాక్టర్ శ్వేత, ఆప్తాల్మిక్ అధికారి శంకర్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక వెంకటేశ్వర్, ప్రిన్సిపాల్ స్వప్న పాల్గొన్నారు.