మంచిర్యాలటౌన్, డిసెంబర్ 19 : మంచిర్యాలకు కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించనుండగా, ఇందుకు సంబంధించిన డ్రోన్ ఏరియల్ సర్వేను గురువారం మంచిర్యాల పట్టణంలోని జడ్పీ పాఠశాల మైదానంలో కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు. ప్రభుత్వం చేపట్టిన అమృత్ 2.0 పథకంలో భాగంగా నూతన మాస్టర్ ప్లాన్ల తయారీకోసం మంచిర్యాల మున్సిపాలిటీని ఎంపికచేశారు. డ్రోన్ ఏరియల్ సర్వేను డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ రీజినల్ డైరెక్టర్ మైఖేల్‌తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని నివాస, వాణిజ్య, వ్యవసాయ భూముల గుర్తింపు, అభివృద్ధి, ఇతర అంశాల పరిశీలన కోసం డ్రోన్ ఏరియల్ సర్వేను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
జిల్లాలోని మున్సిపాలిటీలు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అందుకు తగిన విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సర్వేలో భాగంగా అమృత్ 2.0 సంబంధించి నివేదిక అందిన తర్వాత అందుకనుగుణంగా మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేసి సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తామన్నారు. మంచిర్యాల మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా మార్చేందుకు ప్రతిపాదనలున్నందున డ్రోన్ ఏరియల్ సర్వే ద్వారా భూముల సమాచారం సేకరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో గణపతి, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ రవీందర్‌రెడ్డి, జిల్లా సంక్షేమాధికారి రౌఫ్‌ఖాన్, డీవైఎస్వో రాజ్వీర్, మైనార్టీ సంక్షేమ అధికారి రాజేశ్వరి, మున్సిపల్ కమిషనర్ మారుతీప్రసాద్, టీపీవో సంపత్, టీపీఎస్ శ్యాంసుందర్, తదితరులు పాల్గొన్నారు.