ఆసిఫాబాద్, ఫిబ్రవరి 22: విద్యాదానం చేయడం అదృష్టంగా భావించాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలోని వివేకానంద చౌక్ సమీపంలో ఉన్న మండల పరిషత్ కాంప్లెక్స్‌లో గురువారం నక్క వెంటమ్మ, యాదగిరి స్వామి ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ హేమంత్ సహదేవరావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్రావు, ఎంపీపీ మల్లికార్జున్, సంస్థ ప్రతినిధులు ఉమేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యారంగం విషయంలో జిల్లా వెనుకబడి ఉన్నప్పటికీ, ఉద్యోగ ఫలితాల్లో టాప్‌లో నిలుస్తున్నదని పేర్కొన్నారు.
నిరుద్యోగులకు ఉపయోగపడేలా పుస్తకాలను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని సంస్థ సభ్యులు, అరిగెల బ్రదర్స్‌ను అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాజధానిలో ఉంటూ మారుమూల జిల్లాను గుర్తుంచుకొని, తల్లిదండ్రుల పేరిట సంస్థను ఏర్పాటు చేసి, ఇలా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ హైమద్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గంధం శ్రీనివాస్, నాయకులు వెంకన్న, శ్రీనివాస్, గోపాల్ నాయక్, నిసార్, షబ్బీర్, భీమేశ్ తదితరులు పాల్గొన్నారు.