నిర్మల్, మే 30(నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లాలో యాసంగికి సంబంధించిన మక్కలు, వరి, జొన్నల కొనుగోళ్లతోపాటు రవాణా ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతున్నదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. శనివారం సాయంత్రం నిర్మల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోళ్లపై నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొక్కజొన్న, వరి, జొన్నల కొనుగోలు ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామన్నారు. మే 31 నాటికి 1.10 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలను కొనుగోలు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. మే 30వ తేదీ నాటికే 1.61 లక్షల మెట్రిక్ టన్నుల మక్కల కొనుగోళ్లు పూర్తి చేసి రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో నిలిచిందన్నారు.
ఇప్పటి వరకు కొనుగోలు చేసిన మొక్కజొన్న పంటకు సంబంధించి 1.34 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలను గోదాములకు తరలించామని, ఇంకా దాదాపు 30 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కేంద్రాల్లో మిగిలి ఉన్నాయన్నారు. రోజుకు 5 నుంచి 6 వేల మెట్రిక్ టన్నుల చొప్పున రవాణా కొనసాగుతున్నదని, జూన్ 2 నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని వెల్లడించారు.
నిర్మల్ జిల్లాలో 1.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగా, ఇప్పటి వర కు 1.08 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 80 నుంచి 85 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని గో దాములకు తరలించామని, ప్రస్తుతం రోజుకు 6 నుంచి 7 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రవా ణా జరుగుతున్నదన్నారు. రెండు మూడు రో జుల్లో మక్కల రవాణా పూర్తయిన తర్వాత అదనపు లారీలు, హమాలీలను ధాన్యం రవాణాకు వినియోగించి రోజువారీ సామర్థ్యాన్ని 9 వేల మెట్రిక్ టన్నులకు పెంచుతామని తెలిపారు. భారీ వర్షాలకు తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రై తులు భ యాందోళనలకు గురికావద్దని స్పష్టం చేశారు.
జొన్నల కొనుగోలు కోసం 13 కేంద్రాలు ఏ ర్పాటు చేశామని, మక్కల కొనుగోళ్లు పూర్తయి న వెంటనే జొన్నల కొనుగోళ్లను ముమ్మరం చేయనున్నట్లు చెప్పారు. క్వింటాలుకు రూ.3,700 మద్ధతు ధరతో మార్క్ఫెడ్ ద్వా రా 35వేల నుంచి 40వేల మెట్రిక్ టన్నుల జొన్నల కొనుగోళ్లు చేపట్టనున్నట్లు వెల్లడించారు. జొన్నల నిల్వ కోసం ఇప్పటికే 20 నుంచి 25వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములను సిద్ధం చేశామని, జూన్ 10వ తేదీ నాటికి కొనుగోళ్లు, రవాణా పూర్తవుతాయని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 1.90లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్, మార్క్ఫెడ్ డీఎం మహేశ్, డీపీఆర్వో విష్ణువర్ధన్ పాల్గొన్నారు.