నిర్మల్ చైన్‌గేట్/తానూర్, ఆగస్టు 30 : తల్లిదండ్రులు మృతి చెందడంతో అనాథగా మారిన దుర్గను అన్ని విధాలుగా ఆదుకుంటామని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. తానూర్ మండలంలోని బెల్తరోడకు చెందిన అనాథ బాలిక మెరోళ్ల దుర్గను (11) శుక్రవారం కలెక్టర్ ఆదేశాల మేరకు మండల అధికారులు తహసీల్దార్ లింగమూర్తి, ఎంపీడీవో అబ్దుల్ సమద్, పెద్దమ్మ అనిత, గ్రామస్తుల సమక్షంలో నిర్మల్‌లోని మహాత్మా జ్యోతిబాఫూలే బాలికల గురుకుల పాఠశాలలో 6వ తరగతిలో చేర్పించారు. బాలికకు స్కూల్ బ్యాగులు, కాస్మోటిక్స్, దుస్తులు, నోటు పుస్తకాలను కలెక్టర్ అందజేశారు.
మంచిగా చదవాలని, ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఫోన్ చేసి చెప్పాలని ధైర్యం చెప్పారు. దుర్గ ఉన్నత చదువులు చదివేలా ప్రభుత్వం తరఫున అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పాఠశాల తరగతి గదులు, వసతి గృహాలు, వంటగది, డైనింగ్‌హాల్, స్టోర్ రూమ్‌ను తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట డీఈవో రవీందర్‌రెడ్డి, తానూర్ ఎంపీడీవో అబ్దుల్ సమద్, తహసీల్దార్ రాజు, జిల్లా బాలల పరిరక్షణ అధికారి దేవి మురళి, సగ్గం రాజు, శ్రీదేవి, ప్రిన్సిపాల్ గీత, సమాజీ సర్పంచ్ గోప సాయినాథ్, మాజీ ఎంపీటీసీ మధుపటేల్, నాయకులు అటల్ దేవిదాస్ మౌలాఖాన్, గ్రామస్తులు పాల్గొన్నారు.
నిర్మల్ వైద్య కళాశాల కలెక్టర్ అభిలాష అభినవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, ప్రాక్టికల్, ఫిజియాలజీ, మ్యూజియం, వివిధ విభాగాలతో పాటు వసతి గృహాన్ని పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని అధికారులకు సూచించారు. అనంతరం పాలిటెక్నిక్ కళాశాలలోని వైద్య విద్యార్థుల వసతి గృహాన్ని కలెక్టర్ సందర్శించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ దరహాస, దినేశ్‌కుమార్, జిల్లా దవాఖాన పర్యవేక్షకులు సరోజ, సునీల్, తహసీల్దార్ రాజు, అధికారులు పాల్గొన్నారు.