మంచిర్యాల, ఫిబ్రవరి 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘మంచిర్యాలలో మాకు నచ్చింది చేస్తాం.. నిబంధనలు పట్టించుకోం.. మాకు ఏ నిబంధనలు వర్తించవు..’ అన్నట్లుగా ఉంది అధికార పార్టీ తీరు. ప్రజాభీష్టం పేరిట విధ్వంసం చేయడం.. ఏ పని చేసినా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చేసి విమర్శల పాలవడం ఆ పార్టీకే చెల్లింది. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ.. దానిని అతిక్రమిస్తూ అధికార పార్టీ వ్యవహరించడం విమర్శలకు తావిస్తున్నది. మంచిర్యాల గోదావరి రోడ్లో రూ.11 కోట్లతో నాలుగు ఎకరాల స్థలంలో మహాప్రస్తానం(శ్మశాన వాటిక) నిర్మాణం చేపట్టారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. శ్మశాన వాటికలోని శివుడి విగ్రహానికి శివరాత్రి పండుగను పురస్కరించుకుని బుధవారం ఎమ్మెల్యే పీఎస్ఆర్ దంపతులు పూజలు చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయద్దు. కానీ.. మంచిర్యాలలో మాత్రం మహాప్రస్తానంలో శివుడి విగ్రహానికి పూజలు ఎలా చేస్తారంటే.. ఇది ప్రారంభోత్సవం కాదు కేవలం పూజలు చేస్తున్నామంటూ చెప్పుకొచ్చారు. రూ.11 కోట్ల ప్రభుత్వ నిధులతో చేపట్టిన నిర్మాణంలో ప్రారంభోత్సవం చేయకుండా పూజలు ఎలా చేస్తారు? ఇది ఎలక్షన్ కోడ్ కోడ్ ఉల్లంఘనలోకి రాదని ఎలా చెప్తారు? ఇలా చేయొచ్చని ఏ చట్టంలో ఉంది? ఎన్నికల సంఘం ఎక్కడైనా ఇలా చెప్పిందా? ఇది కచ్చితంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలోకే వస్తుంది. జిల్లా అధికారులు అన్ని తెలిసి కూడా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తుంటే చూస్తూ ఊరుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మహాప్రస్తానం శ్మశాన వాటిక నిర్మించడం మంచి విషయమే. కానీ.. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా అధికారికంగా ప్రారంభించని మహాప్రస్తానంలో శివుడి విగ్రహానికి పూజలు నిర్వహించే అధికారం ఎమ్మెల్యేకు ఎక్కడిది అంటూ అధికార పార్టీ నాయకులే గుసగుసలాడుకుంటున్నారు. రూ.11 కోట్లు ప్రభుత్వ నిధులు కాదా? ఆ పని చేపిస్తున్నది ప్రభుత్వమైనప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర మంత్రుల ఫొటోలు లేకుండా ఫ్లెక్సీలు కొట్టించి ప్రచారం చేసుకోవడం ఏంటని పెదవి విరుస్తున్నారు. ప్రోటోకాల్ పాటించకుండా.. ఎన్నికల కోడ్ అమల్లో ఉందని తెలిసినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా కేవలం వ్యక్తిగత రాజకీయ మెప్పు కోసం.. హడావుడిగా శివుడి విగ్రహానికి పూజలు చేశారనే విమర్శలు వస్తున్నాయి. సొమ్ము ఒకరిది.. సోకు ఒకరిది అన్న చెందంగా పరిస్థితి మారిపోయిందంటూ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అంటే పడని సీనియర్లు మండిపడుతున్నారు. ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనుల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా పూజలు చేయడం, శిశుడి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నట్లు ప్రచారం చేయడంపై చర్యలు తీసుకోవాల్సిందే అంటున్నారు. ఇలా కోడ్ ఉల్లంఘన కిందకు రాదో కలెక్టర్ సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మేలు చేసేలా నస్పూర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ట్రస్మా(తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్) నాయకులు ఓటర్లకు డబ్బులు పంచుతూ రెడ్‌హ్యాండెడ్‌గా మీడియాకు దొరికారు. పాఠశాల బయటి నుంచి లోపల డబ్బులు పంచుతున్న సదరు ట్రస్మా నాయకుల ఫొటోలు, వీడియాలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మీడియాను చూసి ఎక్కడికి అక్కడ సర్దుకుని, కాసేపటికి పాఠశాలకు లాక్ చేసుకుని వెళ్లిపోయిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. మీడియాలోనూ ఈ వ్యవహారంపై ప్రముఖంగా వార్తా కథనాలు ప్రచురితమయ్యాయి. కానీ.. జిల్లా అధికారులు ఆ పాఠశాలపై గానీ, డబ్బులు పంచిన ట్రస్మా నాయకులపై చర్యలు తీసుకోలేదు. అధికార పార్టీ అభ్యర్థికి సంబంధించిన వ్యవహారం కావడంతోనే జిల్లా అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదనే విమర్శలు వస్తున్నాయి.
ఇక ఇదే నస్పూర్‌లోని తీగల్ పహాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోలింగ్ బూత్లోనూ ఎన్నికల కోడ్ ఉల్లంఘన విషయంలోనే బీజేపీ-కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య వాగ్వాదం తలెత్తినట్లు తెలుస్తున్నది. ఇక్కడ అధికార పార్టీ నాయకులు కోడ్ ఉల్లంఘించి, నిర్దేశించిన పరిధి దాటి వెళ్లి ప్రచారం చేశారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. పోలీసులు అధికార పార్టీకి సహకరిస్తూ మా పార్టీ లీడర్‌పై దాడి చేశారంటూ, పోలింగ్ బూత్ లోపల ప్రచారం నిర్వహించినట్లు అసత్యాలు చెప్తున్నారంటూ ఆ పార్టీ నాయకులు రోడ్డుపై రాస్తారోకో చేశారు. ఇవేవి పట్టనట్లు, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు తమకు ఎలాంటి సంబంధం లేదన్నట్లు జిల్లా అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తున్నది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ పలువులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అధికారులు అధికార పార్టీకి అంటకాగడంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామంటున్నారు.