కాగజ్‌నగర్, జూలై 17: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు షరతులు లేని రుణ మాఫీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోని పద్మాశాలీ సేవా సంఘం భవనంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గానికి రూ.4350 కోట్లు మంజూ రు ప్రకటించుకున్నారని, రాష్ట్రంలో సిర్పూర్ నియోజకవర్గం లాంటి వెనుబడిన ప్రాంతాలకు సైతం నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన కొందరు నాయకులు కబ్జాలకు, గూండాగిరి చేస్తున్నారని, అక్రమ దందాలకు ప్రోత్సహిస్తూ ఈ ప్రాంతాన్ని దోచుకుంటున్నారని, ఇకా వారి ఆటలు సాగనివ్వబోమన్నారు. దొంగలు పార్టీ మారినంత బీఆర్ఎస్ బలహీనం కాదని, పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. గతంలో ఉన్న ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే ఈ నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ధర్నాలు చేయడం సరికాదని, ప్రభుత్వాన్ని నిలదీసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నారు.
2008 కౌటాల మండలంలోని ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు కోసం 6 వేల ఎకరాల భూమిని కాంగ్రెస్ సర్కారు సేకరించిందన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.9 వేల కోట్లు మంజూరు చేయగా, రూ.1700 కోట్లు ఖర్చు చేసి కాలువలు తవ్వి వదిలేశారని, ఇప్పటికీ రైతులకు నష్టపరిహారం రాలేదని తెలిపారు. 8 లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నా ఒక్కటీ పనిచేయడం లేదని, ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసి లిఫ్ట్ ఇరిగేషన్లను పునరుద్ధరించాలన్నారు.
తలాపున ప్రాణహిత పారుతున్నప్పటికీ సాగునీరందక వర్షాల కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఆడ, కుమ్రం భీం, పీపీ రావు ప్రాజెక్టులు పూర్తి చేసి పూర్తి స్థాయిలో కాలువలు నిర్మించాలన్నారు. కాగజ్‌నగర్ మండలంలోని ఇస్గం పరిధిలోని చెరువులు, కాలువలు పూడికతో నిండిపోవడంతో సాగు నీరు అందని ద్రాక్షగా మారిందన్నారు. అటవీ ప్రాంతం శివారులోని గ్రామా ల ప్రజల భూముల్లో రాత్రి వేళల్లో అటవీ శాఖ అధికారులు మొక్కలు నాటుతున్నారని, కందకాలు తవ్వుతున్నారని ఆరోపించారు.
జాతీ య పులుల సంరక్షణ సంస్థ, వైల్డ్‌లైఫ్ బోర్డు నుంచి అనుమతులు లేకుండా అంకుసాపూర్ గ్రామ పంచాయతీలో పరిధిలో ఇథనాల్ ప్లాంట్ నిర్మిస్తుంటే అటవీ శాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడవం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల పొత్తు ఉండడంతోనే పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
సిర్పూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ సమన్వయ కమిటీ కన్వీనర్‌గా లెండుగూరే శ్యాంరావును ఎన్నుకున్నట్లు తెలిపారు. కాగజ్‌నగర్ పట్టణ, మండలాల వారీగా సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ నియోజకవర్గం సమన్వయ కమిటీ కన్వీనర్ లెండుగూరే శ్యాంరావు, బీఆర్ఎస్ నాయకులు రాజ్‌కుమార్, ఖాజా సమియొద్దీన్, అంబాల ఓదెలు, రాజ్‌కుమార్, కౌన్సిలర్ మిన్హాజ్, తదితరులు పాల్గొన్నారు.