ఆదిలాబాద్, మే 6(నమస్తే తెలంగాణ) ః కరువు భత్యం ఇవ్వాలని, పీఆర్సీ ప్రకటించాలని ఉద్యోగ సంఘాల డిమాండ్ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్యోగుల గురించి చేసిన వ్యాఖ్యలు ఆదిలాబాద్ జిల్లాలోని ఉద్యోగుల్లో ఆగ్రహానికి కారణమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయంశంగా మారాయి. తమకు ఇవ్వాల్సిన వాటిని అడగడంతో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు. కష్టపడి పనిచేస్తూ ప్రభుత్వ పథకాల అమలు కోసం పనిచేస్తున్నామని చర్చించుకుంటున్నారు. సీఎం వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు ఈ వ్యాఖ్యలను ఆసక్తిగా వింటున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల గురించి ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని జనం అంటున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని ఉద్యోగ సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు.
ఉద్యోగులకు రావాల్సిన ఐదు డీఏలు, పీఆర్సీ విషయం అడిగితే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడిన భాష సరిగా లేదు. రెండు శాతం ఉన్న ఉద్యోగులు 98 శాతం మంది ప్రజలపై సమరం చేస్తారా? అని వ్యాఖ్యానించడం సరికాదు. తాము ప్రభుత్వ పథకాలను ఆపమని ఏ నాడు చెప్పలేదు. 16 నెలలుగా తమ సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రాలు ఇస్తున్నా ఫలితం ఉండడం లేదు. రిటైర్డ్ ఉద్యోగులు జమ చేసుకున్న డబ్బులను కూడా ఇవ్వడం లేదు. బోనస్, కొత్త డిమాండ్లను ఏమీ అడగడం లేదు. డీఏలు ఇస్తే ఒక్కో ఉద్యోగికి రూ.10 వేల వరకు జీతం పెరుగుతుంది.
సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీ వేసి నాలుగు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు ఉద్యోగ సంఘాల నాయకులతో ఒక్క సమావేశం నిర్వహించలేదు. ఉద్యోగులకు హెల్త్‌కార్డులు లేవు. ప్రభుత్వం ఆర్థికేతర అంశాలను పట్టించుకోవడం లేదు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉద్యోగుల పెండింగ్ బకాయిల చెల్లించడానికి రూ.500 కోట్లు ఫిబ్రవరిలో విడుదలు చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు నయా పైసా ఇవ్వలేదు. ఉద్యోగులు రాష్ట్ర ఆదాయం పెంచాలని అంటున్నారు తప్ప మా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం లేదు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఈ నెల 15 నుంచి దశలవారీగా ఆందోళనలు చేపడుతాం.
– సంద అశోక్, ఉద్యోగుల సంఘం జేఏసీ చైర్మన్, ఆదిలాబాద్ జిల్లా