మంచిర్యాల, ఆగస్టు 16(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎన్నికలకు ముందు రూ.రెండు లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చాక మాట మార్చింది. ముందేమో డిసెంబర్ 9న రుణమాఫీ అని చెప్పి తేదీలు మార్చుకుంటూ వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి చివరకు ఏ జిల్లాకు వెళ్తే ఆ జిల్లాలో దేవుళ్లపై ఒట్లు పెడుతూ వచ్చారు. బాసర సరస్వతీ మందిరం మీద ఒట్టు వేసి మరీ ఆగస్టు 15వ తేదీలోగా రూ.రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. అమ్మవారి గుడిపై ఒట్టేసి ఇచ్చిన హామీ నెరవేరకముందే రుణమాఫీ పూర్తి చేశామంటూ సీఎం రేవంత్‌రెడ్డి గొప్పలు చెప్పుకోవడంపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు మండిపడుతున్నారు. బాసర అమ్మవారి గుడిపై ఒట్టేసి రుణమాఫీ చేయకుండానే చేశామంటూ అబద్ధాలు చెప్పడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడో విడుతలో రూ. రెండు లక్షలు మాఫీ అని ప్రకటించినప్పుడు 15వ తేదీలోపే ఆ డబ్బులు ఖాతాల్లో జమకావాలి. కానీ ఆ రోజున ప్రారంభించి కొందరి రైతులకు చెక్కులు ఇస్తే నెరవేరినట్లు ఎలాఅవుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. పోనీ మూడో విడుత జాబితా ఏమైనా బయటకి వచ్చిందా అంటే.. అదీ లేదు. రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు పడనేలేదు. వ్యవసాయ శాఖ ఏఈవోలే ఈ విషయాన్ని రైతులు ఉండే వాట్సాప్ గ్రూపుల్లో మెస్సేజ్‌ల రూపంలో పంపిస్తున్నారు. ఇవేవీ లేకుండా కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసం ప్రకటన చేసిన తీరు రాష్ట్ర సర్కారును అభాసుపాలు చేస్తున్నది. చివరకు ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేయలేరు అన్న మాజీ మంత్రి హరీశ్‌రావు మాటలే నిజమయ్యాయి. దేవుళ్లపై ఒట్టేసి మరీ ఇచ్చిన హామీని నెరవేర్చకపోగా, మాఫీ చేసి రైతుల రుణం తీర్చుకున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించడంపై జనాలు మండిపడుతున్నారు.
రూ. రెండు లక్షల రుణమాఫీ కోసం రూ.40 వేల కోట్లు అవుతుందని రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారానికి ముందు ప్రకటించారు. ఎన్నికలయ్యాక రూ.31వేల కోట్లతో రుణమాఫీ చేయాలని కేబినెట్ తీర్మానించింది. మొన్నటికి మొన్న బడ్జెట్లో రూ.26వేల కోట్లు పెట్టి తీరా ఇప్పుడు రూ.17,934 కోట్లతో అయిపోయింది అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగికి, పింఛన్ తీసుకునేవాళ్లకి, ఐటీ రిటర్న్స్ కట్టేవాళ్లకు, రేషన్‌కార్డ్ లేని వారికి ఇలా అనేక రకాల కొర్రీలు పెట్టి 100 మందిలో 40 మందికే మాఫీ చేసి 60 మందికి ఎగ్గొట్టింది. ఈ లెక్కన ఎన్నికల్లో ఒట్లేసి గెలిపించిన రైతులను కాంగ్రెస్ సర్కారు మోసం చేసింది. ఉమ్మడి జిల్లాలో 2.27 లక్షల మందికి రుణమాఫీ చేసినట్లు చెబుతున్న అధికారులు రూ.రెండు లక్షల లోపు రుణం తీసుకున్న రైతుల వివరాలు మాత్రం లేవని చెప్పడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. మరి అర్హుల జాబితా ఎలా రూపొందించారంటే పైనుంచి వచ్చిన లిస్టులో ఉన్నవారికి మాత్రమే మాఫీ అయినట్లు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో రూ.రెండు లక్షల లోపు రుణాలు మాఫీ కానీ వారిసంఖ్య సైతం లక్షల్లోనే ఉంటుందని, అందుకే వివరాలు బయటికి ఇవ్వొద్దని ప్రభుత్వం నుంచి ఇన్స్ట్రక్షన్ ఉందంటూ కొందరు అధికారులే చెప్పడం గమనార్హం. ఈ లెక్కన రుణమాఫీ కాని రైతులు ఎంత మంది ఉన్నారన్నది బయటకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. కొందరు అర్హులకు రుణమాఫీ కాలేదని.. అలా కానీ వారు కలెక్టరేట్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలంటున్నారు. అంటే రేపటి నుంచి రైతులు సాగుపనులన్నీ వదులుకొని అధికారుల చుట్టూ తిరగాలా అంటూ అన్నదాతలు మండిపడుతున్నారు.
సీఎం కేసీఆర్ సర్కారు 35 లక్షల మంది రైతులకు రూ.లక్ష వరకు రూ.17వేల కోట్లు రుణమాఫీ చేసింది. ఇప్పుడు 22 లక్షల మంది రైతులకు రూ.రెండు లక్షల వరకు చేసినా రూ.17వేల కోట్లు అయ్యిందంటున్నారు. ఈ లెక్కన సగానికి సగం మందికి రుణమాఫీ కాకుండా ఎగొట్టినట్లు స్పష్టం అవుతున్నది. రుణమాఫీ కానీ రైతుల్లో ఇప్పటికే కాంగ్రెస్ సర్కారుపై నైరాశ్యం నెలకొన్నది. రుణమాఫీ కాలేదని బయటికి వచ్చి చెప్పుకోలేని దుస్థితిలో అన్నదాతలు ఉన్నారు. రుణమాఫీ కాలేదని చెబితే కాంగ్రెస్ నాయకులు ఇబ్బందులు పెడుతారని, తమను వదిలేయండి అంటూ రైతులు అంటున్నారు. కానీ కడుపు మండిన అన్నదాతలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని రైతుసంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా చేసిన తప్పుడు వాగ్ధానాన్ని, రూ.రెండు లక్షల రుణం మాఫీ చేసినట్లు చేసిన ప్రకటనలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై రుణమాఫీ కాని రైతుల అభిప్రాయాలు ఇలా..
భీమారం, ఆగస్టు 16 : మా ఊరిలో నాకు రెండెకరాలు ఉంది. మూడేళ్ల క్రితం భీమారం ఎస్బీఐలో క్రాఫ్‌లోన్ రూ. 1.60 లక్షలు తీసుకున్న. మూడో విడుతలో కూడా మాకు రుణం మాఫీ కాలేదు. ఇదెక్కడి న్యాయం. గిట్లయితే అప్పు ఎలా తీర్చాలి. రైతుబంధు సాయం కూడా రాకపాయే. రుణమాఫీ కోసం సార్లను అడిగితే తెల్వదు అంటున్నరు. మంచిర్యాల కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్‌లు పెడుతమని చెబుతున్నరు. ఇగ ఆఫీసుల పొంటి ఎక్కడ తినగాలే.. ఇటు పొలం పనులు ఎప్పుడు చేసుకోవాలే.
జన్నారం, ఆగస్టు 16 : నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. గతంలో రూ 1.70 లక్షల పంటరుణం తీసుకున్న. కాంగ్రెస్ సర్కారు రూ. 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని చెబితే సంబురపడ్డ. కానీ నాకు రుణం మాఫీ కాలేదు. బ్యాంక్ రుణం దొరకక ఎక్కువ వడ్డీకి అప్పులు చేసి పంట చేస్తున్న. ఇకనైనా సీఎం రేవంత్‌రెడ్డి నా పంట రుణం మాఫీ చేసి ఆదుకోవాలి.