కేసీఆర్.. మూడక్షరాల మాదిరిగానే మూడు విడుతల్లో రైతుల రుణాలను మాఫీ చేసిన దేవుడు. కర్షకలో కానికి ఏదైనా మంచి చేయాలని నిరంతరం పరిత పించే నిత్యాన్వేషి. రైతు సంక్షేమమే ధ్యేయంగా వారి జీవితాల్లో వెలుగులు నింపాలని పథకాలు ప్రవేశ పెట్టిన ప్రగతి సారథి. రైతుబంధు, రైతుబీమా, నిరంతర కరెంటు వంటి పథకాలు ప్రవేశపెట్టి దేశానికే రాష్ర్టాన్ని మోడల్‌గా నిలిపిన తెలంగాణ విధాత. మాట ఇచ్చిండంటే.. నెరవేరుస్తాడంతే..! ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. అవాంతరాలు వచ్చినా చేసి తీరుతడనే పేరున్న మహానేత. అటువంటి మహామనిషి.. బుధవారం రైతుల రుణాలను ‘లక్ష’ణంగా మాఫీ చేస్తానని ప్రకటించి రైతుల గుండెల్లో నిలిచాడు. కోటి ఆశలతో ఎదురు చూస్తున్న కర్షకలోకానికి తీపికబురు అందించారు. ఈ ప్రకటనతో పల్లె, పట్నం, ఊరూవాడా.. రైతన్నల సంబురాలతో మారుమోగిపోతున్నది. ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో బాజాభజంత్రీల మధ్య ర్యాలీలు, సీఎం చిత్రపటాలు, ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు చేశారు. వరి నారుతో ‘జై కేసీఆర్.. జై బీఆర్ఎస్’ అక్షరాలు రాస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ వేడుకల్లో రైతులు, రైతు సంఘాల నాయకులు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నాయి.
– మంచిర్యాల ప్రతినిధి/నిర్మల్, ఆగస్టు 3(నమస్తే తెలంగాణ)

రైతుహితం..కేసీఆర్ అభిమతం
మంచిర్యాల ప్రతినిధి/నిర్మల్, ఆగస్టు 3(నమస్తే తెలంగాణ) : రైతు బాంధవుడు, సీఎం కేసీఆర్ పంట రుణాలు మాఫీ చేయడంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంట పెట్టుబడి కోసమో, బిడ్డ పెండ్లి కోసమో, ఆపద కోసమో బ్యాంకుల్లో పాస్‌బుక్‌లు తాకట్టు పెట్టి రుణాలు తెచ్చుకుంటే తిరిగి కట్టలేక ఇబ్బంది పడుతున్న రైతులను చూడలేక సీఎం కేసీఆర్ రుణమాఫీ చేసి అండగా నిలిచారని సంబుర పడుతున్నారు. రైతుబంధు ఇస్తున్నప్పటి నుంచి అప్పు చేయాల్సిన అవసరం రాలేదని, ఇప్పుడు పాత రుణాలు మాఫీ చేసి రైతులందరినీ రాజును చేశారంటున్నారు. రైతులకు బీమా, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించి, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టులతో పొలాలను తడుపుతూ రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిన కేసీఆర్, ఏండ్లుగా పేరుకుపోయిన రుణభారాన్ని తీర్చి పెద్ద మనసును మరోసారి చాటుకున్నారని రైతులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినా, కరోనాతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సహకరించకుండా రైతుబంధు, రైతుబీమా కార్యక్రమాలను నిరంతరంగా కొనసాగించారని, ఇప్పుడిప్పుడే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతున్నందున రైతుల రుణాలు మాఫీ చేయాలని ఆదేశించడం గొప్పవిషయం అని వేయినోళ్ల పొగుడుతున్నారు. రుణమాఫీ ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతులు సంబురాలు చేసుకుంటున్నారు.

పండుగ వాతావరణంలో సంబురాలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఊరూవాడా ఏకమై పండుగ వాతావరణంలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు సంబురాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మిఠాయిలు పంచుకొని, పటాకులు కాల్చారు. కొందరు రైతులు పొలాల్లోకి దిగి నాట్లలో జై కేసీఆర్, జై బీఆర్ఎస్ అనే అక్షరాలు రాసి అభిమానాన్ని చాటుకున్నారు. ట్రాక్టర్లు, ఎండ్లబండ్లలో పెద్ద ఎత్తున ర్యాలీలు తీశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో కేసీఆర్ చిత్రపాటానికి పాలాభిషేకం నిర్వహించారు. మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, పీఏసీఎస్ చైర్మన్ సందెల వెంకటేశ్, బీఆర్ఎస్ యువ నాయకుడు నడిపల్లి విజిత్‌రావు పాల్గొన్నారు. లక్షెట్టిపేటలో నిర్వహించిన కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాల్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగన్న, మున్సిపల్ చైర్మన్ నల్మాసు కాంతయ్య పాల్గొన్నారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, బోథ్ నియోజకవర్గ కేంద్రంలో ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు తుల శ్రీనివాస్ పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రైతుబంధు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు వెంకట్రామ్రెడ్డి పాల్గొన్నారు. అన్ని మండల కేంద్రాలు, పలు గ్రామాల్లో రైతు సంఘాల నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాలాభిషేకాలు చేశారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి పాలాభిషేకం చేశారు. అన్ని మండల కేంద్రాలు, పలు గ్రామాల్లో రైతు సంఘాల నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాలాభిషేకాలు చేశారు.

దేశంలో ఎక్కడా..
లక్ష్మణచాంద, ఆగస్టు 3 : ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి. రైతులు బాధ పడవద్దనే అన్ని రకాలుగా ఆదుకుంటున్నరు. ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమాలాంటి పథకాలు అమలు చేస్తున్నరు. ఇట్లా దేశంలో ఎక్కడా చేసినోళ్లు లేరు. ఇచ్చిన మాట ప్రకారం రూ. లక్ష వరకు రుణలను మాఫీ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. బతికున్నంత కాలం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంట.
పాణమోలె చూస్కుంటున్నడు
ఖానాపూర్ రూరల్, ఆగస్టు 3 : నాకు మా ఊరిలో రెండకరాల భూమి ఉంది. బ్యాంకులో రూ. 50 వేల రుణం తీసుకున్న. వడ్డీతో కలిపి రూ. 70 వేలు అయ్యింది. బ్యాంకు అధికారులు డబ్బులు కట్టమని ఫోన్లు చేస్తున్నారు. ఎట్లా కట్టుడోనని భయపడ్డ. గింతల్నే సీఎం కేసీఆర్ రూ. లక్ష లోపు రుణమాఫీ చేస్తామని చెప్పిండు. మస్తు సంబురమైతంది. ఇచ్చిన మాట మీద నిలబడి దేవునోలె సాయం చేసిండు. గింత మంచి ముఖ్యమంత్రిని చూసింది లేదు. రైతులను పాణమోలె చూస్కుంటున్నడు. బతికున్నంత కాలం ఆయనను తల్సుకుంటం
– సుంకరిపల్లి కొమురయ్య, ఖానాపూర్
సీఎం కేసీఆర్ సార్ పుణ్యమే..
తానూర్, ఆగస్టు 3 : సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ రైతు బాంధవుడయ్యిండు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రూ. లక్ష రుణమాఫీ చేస్తున్నామని చెప్పిన్రు. ఇందుకు చాలా సంతోషంగా ఉంది. 24 గంటల కరంట్, రైతుబీమా, రైతుబంధు వంటి గొప్ప పథకాలు తీసుకొచ్చి అన్నదాతల కన్నీళ్లు తుడిసిండు. నాడు ఎవుసం దండుగ అని ఊరు ఇడిసిపెట్టి పోయినోళ్లు.. ఇప్పుడు తిరిగొచ్చి పండుగలా ఎవుసం చేస్తున్నరు. ఇదంతా సీఎం కేసీఆర్ సార్ పుణ్యమే.. రైతు సంక్షేమం గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు కేసీఆర్.
– గంగారెడ్డి, రైతు, తానూర్
రైతులకు రందే లేదు..
బోథ్, ఆగస్టు 3 : ఇది వరకున్న పాలకులు అసలు రైతులను పట్టించుకున్నది లేదు. కరెంటుంటే.. నీళ్లు.. నీళ్లుంటే కరెంట్ ఉండేటిది కాదు. ఇగ ఎరువుల కోసం ఎగబడేటోళ్లం. తెలంగాణ వచ్చి కేసీఆర్ సీఎం అయినంక మస్తు మేలు చేస్తున్నరు. ఇసొంటి సర్కారును ఇంత వరకు సూడలే. రైతుబంధు, రైతుబీమా, సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు, ఉచిత కరెంట్ ఇట్లా అనేక మంచి పనులు చేస్తున్నది. ఇప్పుడు రూ. లక్ష రుణాన్ని మాఫీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పిండు. అసలు రైతులకు అసలు రందే లేకుంట చేసిన్రు.
– మాద నారాయణ, రైతు, పిప్పల్‌ధరి
ఇగ లోన్ మాఫీ అయితది..
సోన్, ఆగస్టు 3 : నా పేరు మహేందర్. మా ఊరు నిర్మల్ మండలం ముజ్గి గ్రామం. నాకు ఐదెకరాల భూమి ఉంది. మక్క, పసుపు, తదితర పంటలు సాగు చేస్తున్న. నిర్మల్‌లోని ఎఫ్ఏసీఎస్ బ్యాంకులో 2018లో రూ. 90 వేల లోను తీసుకున్న. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ రుణమాఫీ చేస్తుండని చెప్పిండట. నా కొడుకు వచ్చి అన్నడు. మస్తు సంతోషమనిపించింది. ఇగ నా లోన్ మాఫీ అయితది. అనేక పథకాలు తీసుకొచ్చి మా రైతుల బాధలు దూరం చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరే.
– నారాయణ మహేందర్, న్యూముజ్గి, నిర్మల్ మండలం
సీఎం మాట ఇస్తే తప్పడు
బోథ్, ఆగస్టు 3 : రూ. లక్ష రుణమాఫీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పిండు. ఇందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ వానకాలం పత్తి, సోయాబీన్, కంది పంటలు వేసిన. అకౌంట్లో రుణమాఫీ డబ్బులు పడితే ఎరువులు, పురుగుల మందు, కలుపు నివారణ వంటి పనుల కోసం ఖర్చు చేసుకుంట. కొంత ఆలస్యమైనా రుణమాఫీ చేసిన్రు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట తప్పేటోడు కాదు. ఒక్కసారి మాట ఇస్తే ఇగ గా పని చేసేదాక ఊరుకోరు. మేమెప్పుడు ఆయన వెంటే నడుస్తుం.
– బొడ్డు రమేశ్, రైతు, కన్గుట్ట