లక్షెట్టిపేట,ఆగస్టు 5 : ప్రజల భాగస్వామ్యముంటేనే ఏ కార్యక్రమమైనా విజయవంతంగా పూర్తి చేయగలుగుతామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం వెంకట్రావుపేట గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ పల్లెలు పచ్చదనంతో ఉంటేనే రాష్ట్రంతో పాటు దేశం కూడా బాగుంటుందన్నారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పరిరక్షించుకోవాలన్నారు. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత ఆరోగ్యం, వనమహోత్సవంపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామ పంచాయతీ సిబ్బంది, అధికారులు, విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి స్వప్న, ఎంపీడీవో సరోజ, డీఎల్పీవో దర్మారాణి, ఎంపీవో శ్రీనివాస్, ఎపీవో వెంకటరమణ, పంచాయితీ సెక్రటరీ వంశీకృష్ణ పాల్గొన్నారు.
మొక్కలు నాటడం అందరి బాధ్యత ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే
ఆసిఫాబాద్ టౌన్, ఆగస్టు 5 : స్వచ్ఛదనం-పచ్చదనం అనేది నిరంతర ప్రక్రియ అని, మొక్కలు నాటి పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. సోమవారం ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్ఆర్ కాలనీలో మున్సిపల్ కమిషనర్ భుజంగరావు అధ్యక్షతన నిర్వహించిన స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమానికి జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్‌కుమార్ టిబ్రేవాల్తో కలిసి హాజరయ్యారు.
మొక్కలు నాటిన అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసుకొని ముందుకు సాగి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. అడ గ్రామపంచాయతీలో డీపీవో భిక్షపతి, డీఆర్డీవో, ఎంపీడీవో శ్రీనివాస్‌తో కలిసి మొకలు నాటారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.