ఆదిలాబాద్, ఆగస్టు 19(నమస్తే తెలంగాణ) ః ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో వర్గవిభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. ఉట్నూర్‌లో మూ డు రోజుల కిందట జరిగిన పీఏసీ సమావేశంలో నా యకుల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపో రు భగ్గుమంది. ఎన్నో రోజులుగా నాయకులు ఒకరి పై ఒకరు అంతర్గతంగా దుమ్మెత్తి పోసుకుంటున్న పీఏసీ సమావేశంలో గ్రూపు విభేదాలు బహిర్గతమయ్యాయి. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రభా వం అంతంత మాత్రంగానే ఉండగా.. నాయకుల మ ధ్య అంతర్గత పోరు పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. సమావేశంలో నియోజకవర్గ నాయకులు తిట్టుకోవడంతో నాయకులు మూతిమీద వేలేసుకున్నారు. ఒకరిపై మరొకరు వాగ్వాదానికి దిగడం, సోష ల్ మీడియాలో వైరల్‌గా మారడంతో చర్చనీయాంశమైంది. నాయకుల్లో క్రమశిక్షణ లోపించడంతోపాటు దిగజారుడు రాజకీయాలకు అద్దం పడుతున్నదని జ నం చర్చించుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా కాం గ్రెస్‌లో నెలకొన్న అంతర్గత విభేదాలు పరిష్కరించడంతోపాటు పార్టీని బలోపేతం చేసే దిశగా ఏర్పాటు చేసిన సమావేశం నాయకుల కొట్లాటతో తలనొప్పిగా మారింది. వ్యవహారం అధిష్టానం ఏమైనా చర్యలు తీసుకుంటుందా? లేదా? అనే చర్చ జరుగుతున్నది.
ఆదిలాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్చార్జి కంది శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంజీవ్‌రెడ్డిల వర్గాల మధ్య చాలా రోజులుగా వర్గపోరు జరుగుతున్నది. సోమవారం ఉట్నూర్‌లో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) సమావేశానికి ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్, ఇతర నాయకులు హాజరయ్యారు. సమావేశం ప్రారంభంకాగానే ఆదిలాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్‌రెడ్డి వచ్చారు. ఈ సమావేశానికి జిల్లాకు చెందిన పలువురు నాయకులకు పాల్గొనే అవకాశం రాలేదు. సంజీవ్‌రెడ్డి సమావేశానికి హాజరు కాగా కంది శ్రీనివాస్‌రెడ్డి వర్గీయులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. పీఏసీలో కమిటీ తమ పేర్లు ఎందుకు లేవంటూ నాయకులను నిలదీశారు. డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్‌తో గొడవకు దిగగా ఆయన సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్‌గా పోటీ చేసిన సంజీవ్‌రెడ్డిని పీఏసీ కమిటీలో ఎలా చేర్చుకుంటారంటూ కంది వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, మంత్రి జూపల్లి కృష్ణారావు నాయకులను సముదాయించే ప్రయత్నం చేయగా వారు వినలేదు. కంది శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహంతో ఊగిపోతూ మంత్రిని నిలదీశారు. అసెంబ్లీ ఎన్నికల్లో రెబల్‌గా పోటీ చేసిన నాయకుడు ఎందుకొచ్చారంటూ ప్రశ్నించారు. దీంతో ఇద్దరు నాయకుల మధ్య తీవ్ర గొడవ జరిగి సమావేశం రసాభాసగా మారింది. పీఏసీ మీటింగ్‌లో నాయకుల గొడవకు దిగడంతో నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి దిగజారిందని ప్రజలు చర్చించుకుంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్‌రెడ్డికి టీపీసీసీ డిసిప్లినరీ యాక్షన్ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సోమవారం ఉట్నూర్‌లో జరిగిన పీఏసీ సమావేశంలో అధిష్టానం నాయకులకు కంది శ్రీనివాస్‌రెడ్డి ఆటంకం కలిగించడంతోపాటు అన్‌పార్లమెంటరీ పదాలు ఉపయోగించారని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్యాంమోహన్ నోటీసులో పేర్కొన్నారు. ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావం త్, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సూచనలు పట్టించుకోలేదని, డీఏసీ నోటీసుకు మూడు రోజుల్లోగా సమాధానం చెప్పాలని సూచించారు.