భీంపూర్, జూలై 21 : ప్రభుత్వం విద్యావ్యవస్థ బలోపేతానికి చర్యలు చేపడుతున్నది. ఈ క్రమంలో సర్కారు బడుల్లో ప్రవేశాలు పెంచి విద్యార్థులకు అవసరమయ్యే సదుపాయాలు కల్పిస్తున్నది. ఇన్నాళ్లు ప్రభుత్వ బడుల్లో చదువుతున్న వారికి అన్ని తరగతులకు సంబంధించిన పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేసేవారు. ఈ ఏడాది నుంచి ఉపాధ్యాయులు చెప్పిన అంశాలను రాసుకునేందుకు నోట్‌బుక్‌లను సైతం అందజేస్తున్నది. త్వరలోనే వర్క్‌బుక్‌లను అందించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఈ ఏడాది నుంచి పుస్తకాలతో పాటు నోట్‌బుక్‌లను సైతం అందజేస్తుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా 6 నుంచి 10వ తరగతి వరకు మండలంలో 927 నోట్బుక్లు పంపిణీ చేయనున్నారు. వీటిలో 6, 7వ తరగతులు చదువుతున్న వారికి ఒక్కొక్కరికి ఆరు నోట్బుక్లు, 9, 10వ తరగతులకు 14, 8వ తరగతి వారికి ఏడు చొప్పున అందజేయనున్నారు. త్వరలో ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు వర్క్‌బుక్‌లు రానున్నాయి. ఈ మేరకు తాంసి ఎమ్మార్సీకి (విద్యావనరుల కేంద్రం) తాంసి, భీంపూర్ మండలాల్లోని పాఠశాలల విద్యార్థుల కోసం నోట్బుక్లు వచ్చేశాయి. త్వరలో వీటిని విద్యార్థుల సంఖ్యను బట్టి అన్ని పాఠశాలలకు చేరవేయనున్నారు. వర్క్‌బుక్‌లు, నోట్‌బుక్‌ల అందజేతతో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
భీంపూర్ మండలానికి సంబంధించి 13 ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న 1-5 తరగతుల విద్యార్థులందరికీ ఒక్కొక్కరికి మూడు చొప్పున వర్క్‌బుక్‌లు త్వరలో ఇస్తారు. 9 యూసీఎస్, 3 ఉన్నత, ఒక కేజీవీబీ, ఒక ఆశ్రమోన్నత పాఠశాల విద్యార్థులకు మొత్తం 1506 వర్క్‌బుక్‌లు అందిస్తారు. రోజూ చెప్పే పాఠాలకు సంబంధించి ప్రణాళికాబద్ధంగా చదవడం, రాయడం కోసం ఈ నోటుపుస్తకాలు ఉపయోగపడతాయి. నోటుబుక్లు, ఆయా విషయాల నోట్స్ కోసం ఎంతగానో ప్రయోజనం చేకూరనున్నాయి. ప్రభుత్వం సర్కారు బడుల విద్యార్థులకు ఇవి ఇవ్వడంతో తల్లిదండ్రులకు ఆర్థికభారం తప్పనున్నది. ప్రతి పాఠశాలకు వీటిని చేరవేస్తున్నామని ఎంఈవో శ్రీకాంత్ తెలిపారు.
ప్రభుత్వం సర్కారు బడులను ‘మన ఊరు-మన బడి’ కింద ఎంతో అభివృద్ధి చేసింది. ఇక ఇప్పుడు ప్రతి విద్యార్థికి వర్క్‌బుక్‌లు ఇవ్వనున్నారు. దీంతో వారిలో నూతనోత్సాహం ఉంటుంది. ప్రభుత్వం నాణ్యతగా రూపొందించిన ఈ వర్క్‌బుక్‌లు విద్యార్థి క్రమశిక్షణగా, విషయాల వారీగా చదివి రాసేందుకు ఉపయోగపడుతుంది. సర్కారు విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఎస్ఎంసీలు సంతోషంగా ఉన్నాయి.
– పాలెపు భూమన్న,హెచ్ఎం, కరంజి(టీ) ప్రాథమిక పాఠశాల
నేను పిప్పల్‌కోటి ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నా. ప్రభుత్వం మాకు ఉచితంగా నోటు పుస్తకాలు ఇస్తున్నదని హెచ్ఎం సంతోష్ సార్ చెప్పారు. ఇప్పటికే మా పాఠశాలలో డిజిటల్ బోధన సాగుతున్నది. స్కూల్ పచ్చదనంతో కళకళలాడుతుండగా, ఎంతో ఆహ్లాదంగా ఉన్నది. రుచికరమైన మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. శుద్ధజలం తాగుతున్నాం. 5వ తరగతిలోపు వారికి వర్క్‌బుక్‌లు ఇవ్వడం మంచిదే. మాకు నోటుపుస్తకాలు ఇవ్వడం అనేది సంతోషకరం. మరింత శ్రద్ధగా చదువుకుంటా. – శివాని, విద్యార్థిని