ఆదిలాబాద్, ఏప్రిల్ 23(నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఓటమి భయం నెలకుందని, అభద్రతాభావంతో ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అంతర్గత ఒప్పందం కుదుర్చుకున్నాయని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అత్రం సుగుణ ఓడిపోతే ఆరు గ్యారెంటీలు అమలు కావని ప్రజలను బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. ఓటమి భయంతో కాంగ్రెస్ ఓడిపోతే ప్రజలు నష్టపోతారనే ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు రేవంత్ వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తాయని ఆయనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. గతంలో ఆదిలాబాద్ పర్యటనలో మోదీని బడే భాయ్ అన్న రేవంత్ ఇప్పడు ప్రధానిని విమర్శించడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. మాజీ ముఖ్యంత్రి రేవంత్‌రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేస్తున్న రేవంత్ ఓటుకునోటు దొంగ అని, పలు అక్రమాలకు పాల్పడ్డారన్నారు. సోమవారం ఆదిలాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ ప్రచారం సభకు ప్రజలు హాజరుకాలేదని, రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు.
రేవంత్ క్షమాపణలు చెప్పాలి..
బీఆర్ఎస్ అభ్యర్థి అత్రం సక్కుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలని జోగు రామన్న డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి అహంకారపూరిత మాటలు మాట్లాడుతున్నారని, ఎస్సీ, ఎస్టీ, బీసీలను అనుమానించేలా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. బీజేపీ పదేళ్ల పాలనలో ఆదిలాబాద్ జిల్లాకు అన్ని రంగాల్లో అన్యాయం జరిగిందని తెలిపారు. సిమెంటు పరిశ్రమను ప్రారంభిస్తామని హామీ ఇచ్చిన మోదీ ప్రభుత్వం సీసీఐ ప్రారంభం విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని లేఖలు రాసిన స్పందించలేదన్నారు. రేవంత్ రెడ్డి సీసీఐని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెబుతామని చెప్పడం వెనుక ఆయన కమిషన్ల కోసం ఆరాటపడుతున్నట్లు స్పష్టమవుతుందన్నారు. బీజేపీ పాలనలో ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వేలైన్, విమానాశ్రయం, నవోదయ స్కూల్ పెండింగ్ సమస్యలు పది సంవత్సరాల్లో పరిష్కారం కాలేదని తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు తగిన బుద్ధి చెబుతారన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు యూనిస్ అక్బానీ, విజ్జిగిరి నారాయణ, సాజిదొద్ద్దీన్, గోవర్ధన్ పాల్గొన్నారు.