చెన్నూర్, మార్చి 18 : చెన్నూర్ మున్సిపాలిటీ అధికారులు పన్నుల వసూళ్ల పేరిట అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. పగలూ.. రాత్రీ అనే తేడా లేకుండా ఇండ్లపైకి వెళ్లి ప్రజలపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. మార్చి నెలాఖరుకల్లా వందశాతం పన్నులు వసూలు చేసే లక్ష్యంతో అధికారులు వాడ వాడలా తిరుగుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సోమవారం రాత్రి పట్టణంలోని విశ్వకర్మ వాడకు చెందిన ఓ వ్యక్తి ఇంటికి వెళ్లిన అధికారులు పన్ను చెల్లించాల్సిందేనంటూ జులుం ప్రదర్శించారు. రోజూ వారి కూలీనని.. ప్రస్తుతం పన్ను చెల్లించే స్థితిలో లేనని ఆయన అధికారులకు వివరించినా.. కనికరం చూపలేదు. ఇంటికి తాళం వేస్తాం.. సామాన్లు తీసి బయట పెడతాం…అంటూ బెదిరించారు.
ఇక చేసేదేమి లేక అప్పటికప్పుడు చుట్టు పక్కల వారి వద్ద నుంచి అప్పు తెచ్చి పన్నులో కొంత మొత్తాన్ని చెల్లించాడు. అంతటితో ఆగని అధికారులు మార్చి నెలాఖరుకల్లా పన్ను మొత్తం చెల్లించాలని, లేదంటే పెద్ద సార్లు వస్తే ఇంకా ఇబ్బంది పడాల్సివస్తుందని హెచ్చరించారు. ఈ విషయం పట్టణమంతా వ్యాపించడంతో మున్సిపాలిటీ అధికారుల తీరుపట్ల ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. పన్నుల పేరిట ఇలా మొండిగా వ్యవహరించడం సరికాదని మండిపడుతున్నారు. ఈ విషయమై మున్సిపాలిటీ కమిషనర్ మురళీకృష్ణను వివరణ కోరేందుకు యత్నించగా అందుబాటులో లేరు.