మంచిర్యాల, మే 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): చెన్నూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయారు. వారం రోజుల క్రితం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో కాంగ్రెస్ పార్టీ పరిశీలకుల ముందే ఎమ్మెల్యేపై చెన్నూర్ సీనియర్ లీడర్ జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి తిరగబడ్డారు. ‘ఎమ్మెల్యే బీజేపీలోకి పోతున్నడా, బీఆర్ఎస్లోకి పోతున్నడా’ అంటూ అనుమానాలు ఉన్నాయంటూ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు మంచిర్యాల జిల్లా కాంగ్రెస్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఎమ్మెల్యే వివేక్‌ను సొంత నియోజకవర్గ లీడర్లే పట్టించుకోని పరిస్థితి వచ్చిందని లోకం కోడై కూసింది. కాగా చెన్నూర్‌లో సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న హేమంత్‌రెడ్డి తన ఇంటి సమీపంలో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేపై జడ్పీ మాజీ వైస్ చైర్మన్ చేసిన వ్యాఖ్యలను హేమంత్‌రెడ్డి ఖండించారు. రాజిరెడ్డి దందాలు బంద్ అయినందుకు, ఆయన పనులేవీ ముందుకు సాగకపోవడంతో ఎమ్మెల్యేను విమర్శించడం సరికాదన్నారు.
చెన్నూర్‌లో ఇన్ని రోజులు ఎన్నో అరాచకాలు నడిచినా మనోళ్లే కదా..మన పార్టీ వారే కదా అని పట్టించుకోకుండా, ఓపిక పట్టిన ఘన చరిత్ర ఎమ్మెల్యే వివేక్ సార్‌ది అని అన్నారు. ఆయన మంచి మనసులో అందరినీ ఒకేలా చూస్తూ, క్షమించినందుకు ఈ శిక్ష వేస్తారా ? అంటూ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు చెన్నూర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద దుమారాన్ని రేపాయి.
ఎమ్మెల్యే వివేక్ సపోర్ట్‌తో ఇన్ని రోజులు రాజిరెడ్డి దందాలు చేశారని, ఇప్పుడు ఆ దందాలు వద్దు అన్నందుకే రాజిరెడ్డి అలా మాట్లాడారంటూ ఆ పార్టీ నాయకులే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం గమనార్హం. సొంత పార్టీ నాయకులపైనే ఎమ్మెల్యే అనుచరవర్గం నాయకులు చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీరుపై చెన్నూర్ స్థానికులు మండిపడుతున్నారు. ఇలాంటి ప్రెస్‌మీట్ ఎప్పుడూ చూడలేదంటూ ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యల వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.