చెన్నూర్ టౌన్, ఫిబ్రవరి 15 : చెన్నూర్ ప్రాంతంలో రెండు చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని, భారీ, స్థానికేతర (నాన్‌లోకల్), వాణిజ్య వాహనాల నుంచి మాత్రమే పర్యావరణ సెస్ వసూలు చేయనున్నట్లు చెన్నూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ఆర్వో) శివకుమార్ తెలిపారు. శనివారం చెన్నూర్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కిష్టంపేట వై జంక్షన్, పారుపల్లి చింత వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల ద్వారా పర్యావరణ సెస్‌లో ఎక్కువ భాగం ఎన్‌హెచ్-63 ద్వారా ప్రయాణించే భారీ వాహనాల నుంచి మాత్రమే టోల్ వసూలు చేయనున్నట్లు పేర్కొన్నారు.
మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ మొదలైన నాన్‌లోకల్ నుంచి వస్తున్న అంతర్రాష్ట్ర వాహనాల నుంచి వసూలు చేస్తామని, చెన్నూర్ ప్రాంత ప్రజలకు చెందిన ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాలవంటి వాటికి పర్యావరణ సెస్ తీసుకోబోమని స్పష్టం చేశారు. స్థానికులకు సెస్ నుంచి మినహాయింపు ఇచ్చామని, ఎవరూ ఆందోళన చెందవద్దని ఎఫ్ఆర్వో వివరించారు. దీనిపై పూర్తిస్థాయిలో అవగాహన కూడా కల్పిస్తామని, చెన్నూర్ ప్రాంత ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో డీవైఆర్వో ప్రభాకర్, సెక్షన్ ఆఫీసర్ చంద్రమోహన్ పాల్గొన్నారు.
పారుపల్లి వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు
కోటపల్లి, ఫిబ్రవరి 15 : గోదావరి నుంచి ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పారుపల్లి గ్రామ సమీపంలోని జాతీయ రహదారి-63 సమీపంలో చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు. పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారుల బృందం ఈ చెక్‌పోస్టులో 24 గంటల పాటు విధులు నిర్వహించనుండగా, ఈ మార్గంలో ఇసుక లోడ్‌తో వెళ్లే లారీల వివరాలు నమోదు చేయనున్నారు.