ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో శనివారం విజయదశమి(దసరా) వేడుకలు కనుల పండువగా కొనసాగాయి. రావణసుర దహన ఘట్టాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. పోలీసులు ఆయుధపూజ నిర్వహించారు. ర్యాలీలు నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని దస్నాపూర్‌లో గల మైదానంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో ఆదిలాబాద్ ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ వెంకటేశ్ దోత్రె పాల్గొన్నారు. నేరడిగొండ మండల కేంద్రంలోని తన నివాసంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆయుధ, వాహన పూజ నిర్వహించారు. అమ్మవారి ప్రతిమకు, ఆయుధాలకు, వాహనాలకు ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో ఎస్పీ గౌష్ ఆలం విజయానికి చిహ్నంగా గాలిలోకి ఐదు రౌండ్లను కాల్చి వేడుకలను ప్రారంభించారు. ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా ఆలయంలో మెస్రం వంశీయులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయదశమి సందర్భంగా నిర్మల్ పట్టణంలోని మహాలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బంగల్‌పేట్‌లో ఏర్పాటు చేసిన జమ్మిపూజ, రావణాసుర దహనాన్ని నిర్వహించారు. భైంసా పట్టణంలోని కిసాన్గల్లిలో గల సాయిబాబా మందిరంలో రావణ దహనం నిర్వహించగా.. ఎమ్మెల్యే రామారావు పటేల్, ఏఎస్పీ అవినాశ్ కుమార్ పాల్గొని రావణ దహనం నిర్వహించారు. ఆయుధాలకు సాయుధ దళ కార్యాలయంలో ఎస్పీ జానకి షర్మిల పూజలు చేశారు.