కెరమెరి, సెప్టెంబర్ 28 : పోరాట వీరుడు కుమ్రం భీం 84వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆసిఫాబాద్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, వెడ్మ బొజ్జు అన్నారు. శనివారం జోడేఘాట్లోని మ్యూజియంలో కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, పీవో ఖుష్బూ గుప్తా, ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, భీం వర్ధంతి కమిటీ గౌరవ అధ్యక్షుడు కుమ్రం సోనేరావ్, ఉత్సవ కమిటీ చైర్మన్ పెందోర్ రాజేశ్వర్, ఆయా శాఖల అధికారులు, ఆదివాసీ సంఘాల నాయకులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఎమ్మెల్యేలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి సీఎం కేసీఆర్ పోరుగడ్డ ప్రగతికి ఎంతో కృషి చేశారని, రూ.25 కోట్లతో రెండు వరుసల రోడ్డు, భీం నిలువెత్తు కాంస్య విగ్రహం, స్మృతివనం, స్మారక మ్యూజియం, జోడేఘాట్ వాసులకు డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేశారని గుర్తు చేశారు. అటవీ అధికారుల అడ్డగింతతో టోకెన్ మోవాడ్ నుంచి హట్టి వరకు 4 కిలో మీటర్ల రహదారి నిర్మాణం నిలిచిపోయిందని, దానిని సైతం పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు.
వర్ధంతికి అన్ని ఏర్పాట్లు చేయాలని, ముఖ్యంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. వర్ధంతి సభకు సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర మంత్రులు వచ్చే అవకాశముందని, దీర్ఘాకాలిక సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లేలా ఆదివాసులు ప్రత్యేక నివేదిక తయారు చేయాలని కోరారు. కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే మాట్లాడుతూ భీం వర్ధంతి, దర్బార్‌కు వీఐపీలు వచ్చే అవకాశమున్నందున హెలీప్యాడ్ నుంచి సభా స్థలం వరకు బారికేడ్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ.. కార్యక్రమానికి వచ్చే వారందరికీ భోజనంతో పాటు తాగునీటి వసతి కల్పించాలని, మహిళలు, పురుషులకు వేర్వేరుగా తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పాటగూడలో అంగన్వాడీ కేంద్రం, బాబేఝరి పాఠశాలలో సిబ్బంది కొరత నివారణకు చర్యలు చేపడతామని చెప్పారు. వర్ధంతి రోజున హట్టి నుంచి జోడేఘాట్ వరకు ఉచిత ఆర్టీసీ బస్సులు నడిపించనున్నట్లు తెలిపారు.
అదనపు కలెక్టర్ దీపక్ తివారీ మాట్లాడుతూ దర్బార్ జరిగే స్థలంలో అన్ని శాఖల అధికారులతో స్టాళ్లు ఏర్పాటు చేయాలని, ప్రజల నుంచి వచ్చే అర్జీలను స్వీకరించి వాటి పరిష్కరానికి కృషి చేయాలన్నారు. ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. హెలీప్యాడ్, సభా వేదికతో పాటు ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. శాంతి భద్రతలకు భంగం కలగకుండా ఆదివాసీలు సహకరించాలని కోరారు.
జోడేఘాట్‌తో పాటు పరిసర గ్రామాలను అభివృద్ధి చేయాలని ఉత్సవ కమిటీ చైర్మన్, పెందోర్ రాజేశ్వర్, మోతీరాం సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజు, సుధాకర్, ప్రభాకర్ రావు, రఘూనాథ్, జగన్నాథ్ రావు, ద్రుపతాబాయి, తహసీల్దార్ దత్తు ప్రసాదరావు, ఎంపీడీవో మహ్మద్ అమ్జద్పాషాతో పాటు అన్ని శాఖల జిల్లా, డివిజన్ అధికారులు పాల్గొన్నారు.