ఆదిలాబాద్, అక్టోబర్ 4 ( నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది సోయాబిన్ పంట దిగుబడి ఆశా జనకంగా ఉన్నా కొనుగోళ్లలో ప్రభుత్వం విధించిన నిబంధనలతో రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. జిల్లాలో శుక్రవారం సోయా కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో స్థానిక ఎమ్మెల్యే పాయల్‌శంకర్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి సోయా కొనుగోళ్లను ప్రా రంభించారు. ఆదిలాబాద్ జిల్లాలో రైతులు వానాకాలం లో 71,226 ఎకరాల్లో సాయాబిన్ పంటను సాగు చేశా రు. సీజన్లో 4,27,356 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేసి ప్రభుత్వ రంగ సంస్థ నాఫెడ్ ద్వారా కొనుగోళ్లకు ఏర్పాట్లు చేశారు. ఇటీవల జరిగిన సమావేశంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఈ ఏడాది రైతులు ఊహించిన విధంగా ఎకరాకు 8 క్వింటాళ్లకుపైగా పంట దిగుబడులు వచ్చాయి. పంట కొనుగోళ్లులో ప్రభుత్వం విధించిన నిబంధనలు రైతుల పాలిట శాపంగా మారాయి. ఎకరాకు 6 క్వింటాళ్లు మా త్రమే కొనుగోలు చేస్తుండడంతో రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదనంగా దిగుబడి వచ్చిన పంటను విక్రయించేందుకు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించాల్సి ఉంటుంది. మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 4892 ఉండ గా ప్రైవేట్ వ్యాపారులు రూ.4300 మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో రైతులు క్వింటాల్‌కు రూ.600 వరకు న ష్టపోవాల్సి వస్తున్నది. పంట కొనుగోళ్లలో కోతలు విధించడం, తేమ, పంట నాణ్యత పేరిట ధరలు తగ్గిస్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పంట కొనుగోలులో సీలింగ్ ఎత్తివేయాలని రైతుల వద్ద ఉన్న మొత్తం పంటను కొనుగోలు చేయాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఏడాది సోయాబిన్ పంట దిగుబడులు బాగున్నాయి. ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ప్రభు త్వం జిల్లాలో నాఫెడ్ ద్వారా సోయాబిన్ పంట కొనుగోళ్లను ఏర్పాటు చేసి ఎకరాకు 6 క్వింటాళ్ల చొప్పున మాత్రమే సేకరిస్తామని అంటున్నారు. పంట కొనుగోళ్లలో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానం సరికాదు. రైతులు మార్కెట్‌కు తీసుకువచ్చిన సోయాను పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలి. ఎకరాకు 12 క్వింటాళ్ల వరకు సేకరించాలి. సోయాబిన్‌లో సహజంగా ఎక్కువ తేమ ఉంటుంది. తేమ శాతం నిబంధన సైతం సవరించాలి. – బండి దత్తాద్రి, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు, ఆదిలాబాద్
సోయా కొనుగోళ్లలో ప్రభుత్వ నిబంధన ఫలితంగా రైతులు నష్టపోయే పరిస్థితి నెలకొన్నది. మద్దతు ధర క్వింటాల్‌కు రూ.4892 ఉండగా ప్రైవేట్ వ్యాపారులు రూ.4300తో కొంటున్నారు. దీంతో క్వింటాల్‌కు రూ.600 వరకు నష్టం జరుగుతున్నది. ప్రైవేట్ వ్యాపారులు పంట కొనుగోళ్లలో కోతలు పెడుతారు. డబ్బులు అప్పటికప్పు డు ఇస్తే రూ.100కు రూ.2 కోత విధిస్తారు. ప్రైవేట్ వ్యాపారులకు పంటను విక్రయిస్తే రైతులు పలు విధాలుగా నష్టపోతారు. ప్రభుత్వమే రైతుల పంటను మొత్తం కొనాలి.
– బొర్రన్న, రైతు స్వరాజ్య వేదిక, జిల్లా అధ్యక్షుడు