కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): పంటలు చేతికి వస్తే రైతులకు ఆనందం కలుగుతుంది. కానీ జిల్లాలోని పత్తి రైతుల్లో మాత్రం ఆందోళన నెలకొన్నది. ఆరుగాలం శ్రమించి.. ప్రకృతి వైపరీత్యాలకు ఎదురేగి తీరా పంటలు చేతికి వచ్చే సమయానికి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఆలస్యంగా కొనుగోళ్లు ప్రారంభించడం…అప్పులు ఇచ్చిన వాళ్లు డబ్బులు అడగడంతో గత్యంతరం లేక రైతులు తాము కష్టపడి పండించిన పత్తిని దళారులకు విక్రయించడం జిల్లాలో సర్వసాధారణమైంది. జిల్లాలో ప్రతి ఏటా పెరుగుతున్న పత్తి విస్తీర్ణం ఈ ఏడాది 3.30 లక్షల ఎకరాలకు చేరింది.
29 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేసేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలవుతున్నది. జిల్లాలో పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా మారుతున్నది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఆశించిన దిగుబడులు రావడం కష్టంగా మారింది. ఈ ఏడాది కురిసిన అధిక వర్షాలతో పూత, కాతపై తీవ్రమైన ప్రభావం పడింది. దిగుబడులు సరిగా రాకపోగా మరోవైపు చేతికొచ్చిన పంట మద్దతు ధర లభించకపోవడం, ప్రభుత్వం నిర్ణయించిన ధరకు సీసీఐ ద్వారా కొనుగోలుకు సకాలంలో ఏర్పాట్లు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
భారీ వర్షాలతో ఇప్పటికే పత్తి పంటకు వాటిల్లిన నష్టానికి తోడు పెరిగిన పురుగుల మందులు, ఎరువుల ధరలు రైతులకు భారంగా మారాయి. ప్రభుత్వం 3.30 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసినట్లు అంచనా వేసిన అధికారులు 23 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. సీసీఐ కొనుగోళ్లు ఆలస్యంగా ప్రారంభమవుతుండడం, గ్రామాల్లో దళారులు కొనుగోళ్లు ముందే ప్రారంభిస్తుండడంతో రైతులు గత్యంతరం లేక వ్యాపారులకే పత్తిని విక్రయించాల్సిన పరిస్థితి వస్తున్నది. జిల్లాలో ఆసిఫాబాద్‌తోపాటు జైనూర్ కాగజ్‌నగర్‌లో మార్కెట్ యార్డులు ఉన్నాయి.
పత్తి కొనుగోళ్లకు కావాల్సిన ఏర్పాట్లను చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్‌ధోత్రే వారం క్రితమే సమీక్షా సమావేశం నిర్వహించి పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మార్కెట్ యార్డులతో పాటు జిల్లాలో ఉన్న 17 జిన్నింగ్ మిల్లుల్లో పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని రైతులకు నష్టం కలగకుండా చూడాలని, దళారుల ప్రమేయం లేకుండా చేయాలని ఆదేశించారు. కాని సీసీఐ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. కనీసం మార్కెట్ యార్డు కాంటాలకు మరమ్మతులు చేసి సరి చేయడం లేదు. ప్రభుత్వం పత్తి క్వింటాల్‌కు ఈ ఏడాది రూ.7 521 మద్దతు ధర నిర్ణయించింది.
దళారుల ప్రమేయం అధికంగా ఉండే ఆసిఫాబాద్ జిల్లాలో అధికారులు రైతులకు అవగాహన కల్పించి మార్కెట్‌యార్డులోనే పత్తి విక్రయించేలా ప్రోత్సహించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు గత్యంతరం లేక దళారులను ఆశ్రయించడమో లేక తమ గ్రామాల్లోకి వచ్చే వ్యాపారులకు పత్తి విక్రయించడమో చేస్తున్నారు. దీపావళి తర్వాత జిల్లాలో పత్తి ఏరడం ప్రారంభమవుతున్నది. ఆ లోపే అధికారులు మార్కెట్ యార్డుల్లో పత్తి కొనుగోళ్లకు సిద్ధం కావాలని అధికారులు పట్టించుకోకపోవడంతో గత్యంతరం లేక దళారులను ఆశ్రయించాల్సి వస్తున్నదని ఆవేదన చెందుతున్నారు.
మాకు అందుబాటులో పత్తి కొనుగోలు కేంద్రాలు లేక ఇబ్బంది పడుతున్నాం. నేను 8 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. వర్షాలు అధికంగా కురవడంతో పత్తికి అనేక రకాల తెగుళ్లు వచ్చాయి. కలుపు ఖర్చు కూడా అధికమైంది. ఎకరానికి గతంలో 8 క్వింటాళ్ల వరకు వచ్చేది. ఇప్పుడు 5 నుంచి 6 క్వింటాళ్లు రావడం కష్టంగా ఉంది. పెట్టుబడి పెరిగేందుకు తోడు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు మాకు అందుబాటులో లేకపోవడంతో దళారులకు విక్రయించాల్సి వస్తున్నది. – మోహర్లే వెంకట్రావ్, బారెమోడి గ్రామం, కెరమెరి
నేను మొత్తం 6 ఎకరాల్లో పత్తి సాగు చేశాను. నాకు ఎకరానికి 4 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చే అవకాశం ఉంది. అధిక వర్షాలతో పత్తి పంటకు చాలా వరకు నష్టం జరిగింది. మేము పత్తి విక్రయించాలంటే ఆసిఫాబాద్‌కు లేదా జైనూర్‌కు గాని వెళ్లాల్సి వస్తున్నది. 40 కిలోమీటర్ల దూరంలోని జిన్నింగ్ మిల్లులో పత్తిని తీసుకెళ్లి అమ్ముతున్నాం. మాకు వచ్చే కొద్ది పాటి దిగుబడికి అంతదూరం తీసుకువెళ్లాలంటే రవాణా ఖర్చులతో పాటు ఇబ్బందిగా మారింది. ఒక్కో సారి రెండు రోజులు కూడా అక్కడే ఉండాల్సి వస్తున్నది. అందుకని మా గ్రామాల్లోకి వచ్చే దళారులకే పత్తి అమ్మేస్తాం. – మడావి రమేశ్, కొలాం ఝరి గ్రామం, కెరమెరి