కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : జిల్లా నుంచి పశువుల అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. కొందరు దళారులు జిల్లాలోని సంతల్లో పశువులను కొనుగోలు చేసి నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకోవడం పరిపాటిగా మారింది. కొందరైతే అడవుల్లో మేతకు వెళ్లిన పశువులను దొంగతనంగా తీసుకొచ్చి వాహనాల ద్వారా సరిహద్దులు దాటిస్తున్నారు. ఇక వాహనాల్లో కిక్కిరిసి ఎక్కించడం వల్ల ఊపిరాడక పశువులు మృత్యువాత పడుతున్నాయి.
మహారాష్ట్ర-సిర్పూర్-టీ అంతర్రాష్ట్ర రహదారి మీదుగా సిర్పూర్-టీ, కౌటాల, గూడెం, చింతలమానేపల్లి, పెంచికల్పేట్, కడంబా, కాగజ్‌నగర్ క్రాస్‌రోడ్డు మీదుగా, వాంకిడి నుంచి ఆసిఫాబాద్ మీదుగా హైదరాబాద్.. కరీంనగర్ తదితర పట్టణాలకు పశువులను కంటెయినర్లలో తరలిస్తున్నారు. జిల్లాలోని వాంకిడి, కౌటాల, జైనూర్, సిర్పూర్ మండలాల్లోని పశువుల సంతల్లో, మహారాష్ట్రలోని గోయగాంలోని వారసంతలో దళారులు పశువులను కొనుగోలు చేసి రాత్రి వేళ్లల్లో గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు. సిర్పూర్-టీ నుంచి కాగజ్‌నరగ్ వరకు, రెబ్బెన నుంచి మంచిర్యాల జిల్లా దాటేవరకు ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని దందా సాగిస్తున్నారు. తరలింపు సమయంలో పోలీసులు తనిఖీల విషయాన్ని ఏజెంట్లు దళారులకు అందిస్తుంటారు. దొంగదారుల్లో పశువులను పట్టణాలకు తరలిస్తుంటారు. జిల్లాలో రెండు మూడు రోజులకో చోట ఈ ఘటన వెలుగుచూస్తున్నది. అధికారులను మచ్చిక చేసుకొని పశువులను అక్రమ రవాణా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
గతంలో వ్యాన్లు, ట్రక్కులు, లారీల్లో పశువులను అక్రమంగా తరలించిన స్మగ్లరు ఇప్పుడు కంటెయినర్లు వాడుతున్నారు. పరిమితికి మించి కంటెయినర్లలో కిక్కిరిసి ఎక్కించడం వల్ల మూగ జీవాలు ఊపిరాడక మృత్యువాత పడుతున్నాయి. ఇటీవల రెబ్బెనలో పట్టుబడ్డ కంటెయినర్లో 24 పశువులను ఎక్కించగా, అందులో 9 మృత్యువాత పడ్డాయి. రెబ్బెనలోని ఏవో బ్రిడ్డి సమీపంలోని అడవిలో చనిపోయిన పశువులను పడేసేందుకు కంటెయినర్‌ని ఆపగా, అదే సమయంలో అక్కడికి వెళ్లిన పోలీసులు గమనించి వాహనాన్ని పట్టుకున్నారు. కంటెయినర్లలో ఎంత క్రూరంగా జీవాలను తరలిస్తున్నారనేదానికి ఈ ఘటనే నిదర్శనం. గత నెల 27న వాంకిడి టోల్ ప్లాజా వద్ద పోలీసుల తనిఖీల్లో పశువులను తరలిస్తున్న కంటెయినర్‌ని పోలీసులు పట్టుకున్నారు.