కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): కాగజ్‌నగర్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని పెంచికల్పేట్ అడవుల్లో వన్యప్రాణులకు రక్షణ కరువవుతున్నది. వేటగాళ్లు అటవీ జంతువులను వెంటాడి చంపడం కలకలం రేపుతున్నది. కేవలం రెండు రోజుల వ్యవధిలో రెండు ఘటనలు వెలుగులోకి రాగా, స్థానికంగా చర్చనీయాంశమవుతున్నది. శుక్రవారం పెంచికల్పేట్ మండలం అగర్‌గూడ వద్డ అధికారులు తనిఖీ చేస్తుండగా, బైక్‌లపై వస్తున్న పెంచికల్‌పేట్‌కు చెందిన అప్పాజి, అప్పాజి వెంకటేశ్, మేకల రమేశ్, ఒడ్డుగూడెంకు చెందిన బింకరి తిరుపతిని ఆపి పరిశీలించారు.
వారి వద్ద రెండు గొడ్డళ్లు లభించాయి. వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా, బొక్కివాగు సమీపంలోని అగర్‌గూడ అటవీ ప్రాంతంలో విద్యుత్ తీగలు అమర్చి ఒక నీలుగాయిని చంపి వండుకొని తిన్నట్లు ఒప్పుకున్నారు. ఈ ఘటనపై అటవీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇందులో మరికొంత మంది పాల్గొని ఉంటారని అటవీ అధికారులు భావిస్తున్నారు.
ఇక శనివారం రాత్రి లోడ్పల్లి శివారు.. కొత్తవాడ సమీపంలోని అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న అటవీ అధికారులకు అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు ఎదురుపడ్డారు. వారిని తనిఖీ చేయగా మాంసంతో కూడిన సంచులు లభించాయి. నిందితులు పరారవుతుండగా, అటవీ అధికారులు వారిని వెంబడించి పట్టుకొని విచారణ చేపట్టారు. చుక్కల దుంపిని చంపినట్లు వారు ఒప్పుకున్నట్లు తెలిసింది. వారి వద్ద నుంచి చుక్కల దుప్పి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో గొర్ల శేఖర్, బొల్లబోయిన గంగయ్య, ఆత్రం శంకర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఎస్వో వేణుగోపాల్ తెలిపారు.
కాగజ్‌నగర్ అటవీ డివిజన్లో యేటేటా పులుల సం చారం పెరుగుతోంది. పులులను సంరక్షించేందుకు అటవీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. పులులతో పాటు వన్యప్రాణాలకు హాని కలిగించవద్దని అటవీ గ్రామాల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అయితే, పులులకు కావాల్సిన ఆహారంగా శాఖాహార జంతువుల సంతతిని పెంచేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నప్పటికీ వేటగాళ్ల బారి నుంచి మాత్రం వాటిని కాపాడలేకపోతున్నారన్న ఆరోపణలున్నాయి.