ఉట్నూర్ : బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి (BRS leader ) భూక్యా జాన్సన్ నాయక్ (Bhukya Johnson Naik) పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో అకారణంగా కేసు నమోదు ( Case ) అయింది. అధికార పార్టీ నాయకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయడం దారుణమని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 2023 నవంబర్ లో ఉట్నూర్ నుంచి ఖానాపూర్‌కు వస్తున్న జాన్సన్ నాయక్‌ను ఉట్నూర్ మండలం కొత్తగూడ చెక్ పోస్ట్ వద్ద కాంగ్రెస్ నాయకులు అడ్డగించి హంగామా సృష్టించి కేసు పెట్టారని ఆరోపించారు.
19 నెలల తరువాత ఉట్నూర్ పోలీసులు జాన్సన్ నాయక్‌కు నోటీసులు అందజేయడం కక్షసాధింపు చర్య అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భూక్యా జాన్సన్ నాయక్ స్పందిస్తూ అధికార పార్టీకి చెందిన నాయకులు తనపై కేసులు ఎన్ని పెట్టినా భయపడేది లేదని, రెట్టింపు ఉత్సాహంతో ప్రజల్లో ఉంటానని స్పష్టం చేశారు . రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాష్ట్రంలో, ఖానాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు. పరిపాలనను మరిచి పోలీసులను అడ్డం పెట్టుకొని కేసులు నమోదు చేస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న వారిని ఎవ్వరిని వదలబోమని హెచ్చరించారు.