ఆదిలాబాద్ : నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వ భూమిని ఆక్రమించడానికి ( Land encroached ) ప్రయత్నించిన సయ్యద్ షాబుద్దీన్, మహమ్మద్ అక్రమ్ లపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి ( DSP Jeevan Reddy ) వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన అక్రమ్ అనే ఏ-2 నిందితుడు భుక్తాపూర్‌లోని మున్సిపాలిటీ ఖాళీ స్థలాన్ని ఆక్రమించాలని దురుద్దేశంతో తన బంధువైన సయ్యద్ షాబుద్దీన్ పై అక్రమ దస్తావేజులు సృష్టించాడని తెలిపారు.
గత 35 సంవత్సరాలుగా మున్సిపాలిటీలో నివసిస్తున్నానంటూ అక్రమ పద్ధతిలో హౌస్ నంబర్‌ను తీసుకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని పేర్కొన్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మున్సిపల్ అధికారులు అతనిపై ఫిర్యాదు చేయగా ఆదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు.
మున్సిపాలిటీ సిబ్బంది పాత్ర పై పూర్తి దర్యాప్తు కొనసాగుతుందని , మున్సిపాలిటీ సిబ్బంది పాత్ర తెలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకునేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే వారిపై పీడీ ఆక్ట్ నమోదుకు సైతం వెనుకాడబోడమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ బి సునీల్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.