ఆదిలాబాద్, మార్చి 5(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గల రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఖరీదైన క్యాన్సర్‌కు ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు. బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రిమ్స్‌లో ఆశన్న, నాందేవ్, పొచక్కలకు క్యాన్సర్ ఆపరేషన్లు నిర్వహించారు. పోచక్కకు వ్యాన్ డ్రాటిక్ క్యాన్సర్, మిగతా ఇద్దరికి కడుపు సంబంధింత క్యాన్సర్ ఆపరేషన్లు చేశారు. ఈ ఆపరేషన్లకు రూ.8 లక్షల వరకు ఖర్చు అయ్యేవి. ఇలాంటి ఖరీదైన ఆపరేషన్లను రిమ్స్‌లో ఉచితంగా చేస్తున్నట్లు, ప్రజలకు సేవలను వినియోగించుకోవాలని పేర్కొన్నారు. సూపర్ స్పెషాలిటీలో ఏడాది కాలంలో 400 ఆపరేషన్లు చేసినట్లు పేర్కొన్నారు. ఆరోగ్య సమస్యలతో బాధపడే వారు హైదరాబాద్, మహారాష్ట్రలోని నాగ్‌పూర్, వరదా వంటి ప్రాంతాలకు వెళ్లేవారని, ఇప్పుడు అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అరుదైన ఆపరేషన్లను చేసిన వైద్యులను రోగుల బంధువులు సన్మానించారు. ఈ సమావేశంలో రిమ్స్ సూపరింటెండెంట్ సత్యనారాయణ, అంకాలజీ సర్జన్ జక్కుల శ్రీకాంత్, న్యూరో సర్జన్ విజయమోహన్, యూరాలజిస్ట్ కార్తీక్, అనస్తీషియా వైద్యులు ఇమానీ, నరేందర్, పిడియాట్రిక్ సర్జన్ దేవిదాస్ పాల్గొన్నారు.