ఆదిలాబాద్ జిల్లాలో బేల, జైనథ్, తలమడుగు, భీంపూర్.. నిర్మల్ జిల్లాలో ముథోల్, కుభీర్, తానూర్, లోకేశ్వరం.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కాగజ్‌నగర్, సిర్పూర్(టీ), కౌటాల.. మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల, కోటపల్లి, చెన్నూర్ మండలాల్లో అధికంగా క్యాన్సర్ కేసులు వస్తున్నట్లు తెలిసింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1664 క్యాన్సర్ కేసులు ఉంటే.. ఈ ఏడాదే అత్యధిక కేసులు వచ్చాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. గడిచిన 12 నెలల్లో ఆదిలాబాద్ జిల్లాలో 162, నిర్మల్‌లో 87, మంచిర్యాలలో 34, ఆసిఫాబాద్‌లో 34 క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి.
మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ కేసులు అధికంగా ఉండగా, పురుషుల్లో ఓరల్(నోటి) క్యాన్సర్ కేసులు అధికంగా వస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఆ చిన్న సమస్యలే తర్వాతి కాలంలో క్యాన్సర్‌కు దారి తీస్తున్నాయి. సమస్య వచ్చిన వెంటనే చికిత్స మొదలుపెడితే క్యాన్సర్ దరి చేరకుండా చూడొచ్చు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కల్పించే దిశగా వైద్యారోగ్యశాఖ చర్యలు చేపట్టాలి.
మంచిర్యాల, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో క్యాన్సర్ కోరలు చాస్తున్నది. 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉమ్మడి జిల్లాలో 317 కొత్త క్యాన్సర్ కేసులు నమోదవడం కలవరపెడుతున్నది. క్యాన్సర్ బారిన పడుతున్న పురుషుల్లో 35 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న వారు, మహిళల్లో 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న వారు ఎక్కువగా ఉండడం ఆందోళనకరంగా మారింది. క్యాన్సర్ కేసులకు శస్త్రచికిత్సలు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో హైదరాబాద్ ఎంఎన్జీ తర్వాత ఆదిలాబాద్ రిమ్స్‌లోనే అధికంగా జరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. కాగా.. ఓరల్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా రావడానికి ప్రధాన కారణం గుట్కా, తంబాకు నవలడమేనని వైద్యాధికారులు చెప్తున్నారు.
12 నుంచి 18 ఏండ్లపాటు రోజు గుట్కా, తంబాకు తినేవారికి క్యాన్సర్ వస్తున్నట్లు గుర్తించామంటున్నారు. మహారాష్ట్రతో సరిహద్దు ఉన్న ఆదిలాబాద్ ప్రాంతాల్లో ఈ తరహా కేసులు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. రెగ్యులర్‌గా దొరికే గుట్కాతోపాటు ఆదిలాబాద్-మహారాష్ట్ర సరిహద్దుల్లో దొరికే కర్ర(కస్టమైస్డ్ గుట్కా) తింటున్న వారు అధికంగా క్యాన్సర్ భారిన పడుతున్నారన్నారు. జిల్లాలో గుట్కా కల్చర్ ఫ్యాషన్‌గా మారిందని అధికారులు అంటున్నారు. పదో తరగతి పూర్తయితే గుట్కా తినొచ్చన్న భావనలో యూత్ ఉన్నారని 15 ఏండ్లకే గుట్కా, తంబాకు నమలడం మొదలుపెడుతున్నారని, దీంతో 30 నుంచి 35 ఏళ్లలోపే క్యాన్సర్ బారిన పడుతున్నారంటున్నారు. దీనిని కట్టడి చేయడంతోపాటు యువతకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందంటున్నారు.
బయటికి చెప్పకపోవడమే సమస్య..
మారుమూల పల్లెలు, గూడేలు, తండాల్లో ఉండే ఆదివాసులు, గిరిజన తెగల మహిళలకు అవగాహన ఉండడం లేదు. రుతుశ్రావం సమయంలో ఎక్కువ బ్లీడింగ్ రావడం, తీవ్రమైన కడుపునొప్పి, ఇతర సమస్యలు బయటికి చెప్పుకోవడం లేదు. రొమ్ము సంబంధింత సమస్యలు గడ్డలు, నీరు కారడం వంటి ఆరోగ్య సమస్యలు తొలిదశలో గుర్తించలేకపోతున్నారు. కానీ.. అవగాహన లేక చెప్పుకుంటే అవతలి వాళ్లు ఏం అనుకుంటారో అన్న మెహమాటంతో క్యాన్సర్ వరకు తెచ్చుకుంటున్నారు. చాలా కేసుల్లో ఇదే ఫీడ్ వచ్చినట్లు వైద్యారోగ్యశాఖ నిపుణులు చెప్తున్నారు. రుతుక్రమం వస్తే ఐదారు రోజులు ఇంట్లోనే ఉండాలి. ఎంత నొప్పి వచ్చిన ఓర్చుకోవాలనే పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, మారుతున్న ప్రపంచంతోపాటు మార్పు రావల్సిన అవసరం ఉందంటున్నారు.
వీఐఏ టెస్ట్ చేయించుకోవాలి..
మహిళలు ఎవరైనా సరే 30 ఏళ్ల వయసు దాటాక ప్రతి నాలుగు లేదా ఐదు సంవత్సరాలకు ఒకసారి వీఐఏ (విజువల్ ఇన్స్‌స్పెక్షన్ విత్ ఆక్టిక్ ఆసిడ్) టెస్టు చేయించుకోవాలి. క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటే ఈ టెస్టులో ముందే గుర్తించి, రాకుండా అడ్డుకట్ట వేయొచ్చు. వైద్యారోగ్యశాఖ ఏఎన్ఎంలు దగ్గర, ప్రతి పీహెచ్సీలో ఈ టెస్ట్ చేసుకునే సదుపాయాలు ఉన్నాయి. మహిళలు భయం వీడి బయటికి వస్తేనే దీనికి పరిష్కారం దొరుకుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే మహిళలందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తున్నాం. ఆదిలాబాద్‌లో 36 శాతం మంది మహిళలను ఇప్పటికే స్క్రీనింగ్ చేశాం. మార్చి నెలాఖరుకు మిగిలిన 68 శాతం పూర్తి చేస్తాం. యూత్ గుట్కా, తంబాకు, పొగాకు లాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. అవి ఫ్యాషన్ కాదు.. క్యాన్సర్ కారకాలని గుర్తించాలి.
– డాక్టర్ శ్రీధర్, ఎన్సీడీ ప్రొగ్రామ్ ఆఫీసర్, ఆదిలాబాద్ జిల్లా

Pp