నార్నూర్ : చట్టబద్ధతలేని వలస లంబాడీల ( Migrant lambadis ) ఆహార భద్రత కార్డులు ( Ration cards ) , బోగస్ సర్టిఫికెట్లు రద్దు చేయడం హర్షనీయమని ఆదివాసి సంక్షేమ పరిషత్ (Adivasi Sankshema Parishad ) గాదిగూడ మండల అధ్యక్షుడు విల్లాస్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండల కేంద్రంలోని కార్యాలయంలో తహసీల్దార్ సత్యనారాయణను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాదిగూడ మండలంలోని వివిధ గ్రామాలలో మహారాష్ట్ర నుంచి వలస వచ్చి నివాసముంటున్నట్లు తెలిపారు. గాదిగూడ తహసీల్ కార్యాలయం, మహారాష్ట్ర లోని జీవిత తహసీల్ కార్యాలయంలో 2014లో ఫిర్యాదు చేశామన్నారు. వలస లంబాడీలకు సంబంధించిన డాక్యుమెంట్లను సేకరించారన్నారు.
విచారణ అనంతరం వలస లంబాడీల ఆహార భద్రత కార్డులు రద్దు చేసినట్లు వివరించారు. మండలంలోని కోలామ చౌక ధార దుకాణం పరిధిలోని ఆహార భద్రత కార్డులను రద్దు చేయాలని సంబంధిత దుకాణ యజమానికి తహసీల్దార్ ఆదేశాలు జారీ చేశారన్నారు. బోగస్ ఆహార భద్రత కార్డులు జారీ చేసిన అధికారులపై జిల్లా కలెక్టర్ చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కుమ్ర శంకర్, మెస్రం నాగోరావ్,సత్యపాల్ ఉన్నారు.