మంచిర్యాల, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘గోదావరి జలాల్లో తెలంగాణ రాష్ర్టానికి 968 టీఎంసీల నీటిని వాడుకునే హక్కు ఉంది. వాటిని దోచేసి ఆంధ్రా-రాయలసీమలో 30 లక్షల నుంచి 40 లక్షల ఎకరాలకు నీళ్లివ్వడానికి చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్ట్ కడుతున్నడు. మా నీళ్లను తరలించుకుపోవడంతో పాటు మా హక్కులు కూడా లాక్కుంటామంటే చూస్తూ ఊరుకోం. టీడీపీ, బీజీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి బనకచర్ల పేరుతో తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తున్నాయి. బనకచర్ల పేరుతో చేస్తున్న కుట్రలను తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో తిప్పి కొడుతాం’ అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, నీటిపారుదల నిపుణుడు వీ.ప్రకాశ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్ రద్దు కోసం శుక్రవారం మంచిర్యాల-ఆసిఫాబాద్ జిల్లాల బీఆర్ఎస్వీ సదస్సుకు వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. దాదాపు 350 టీఎంసీల రిజర్వాయర్‌ను బనకచర్ల కట్టి రాయలసీమ ప్రాంతంతో పాటు నెల్లూరు, ఒంగోలు జిల్లాలకు సైతం నీళ్లు తీసుకుపోయేందుకు బాబు ప్లాన్ చేస్తున్నారన్నారు. ఇప్పటి దాకా కృష్ణా నదీ జలాలను దొంగతనంగా తీసుకెళ్లారంటూ మండిపడ్డారు. కృష్ణా, గోదావరి బోర్డులు వచ్చాక టెలిమెట్రీలు పెట్టి లెక్కలు తీస్తామంటే.. ఆంధ్రా ప్రభుత్వం టెలీమెట్రీలకు డబ్బులు కట్టడం లేదన్నారు. ఎందుకుంటే ఆ మీటర్లు పెడితే పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు ఎన్ని నీళ్లు తరలిస్తున్నారో తెలిసిపోతుందని భయపడుతున్నారన్నారు. భవిష్యత్‌లో తప్పనిసరి పరిస్థితుల్లో మీటర్లు పెడితే కృష్ణా నది నీళ్లను ఇష్టం వచ్చినట్లు తీసుకుపోవడం వీలుకాదన్నారు. అది కుదరదు కనుకే గోదావరి నీళ్లను తీసుకుపోయేందుకు బనకచర్ల ప్రాజెక్టును తెస్తున్నారన్నారు.
కొందరు సన్నాసులు కాళేశ్వరం, బనకచర్ల రెండూ ఒక్కటే అని చెబుతున్నారంటూ వక్తలు మండిపడ్డారు. సదస్సులో భాగంగా పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించి విద్యార్థి నాయకులకు అవగాహన కల్పించారు. కాళేశ్వరం అనేది తెలంగాణ జీవధార అని, లక్షల ఎకరాలకు సాగునీరందించే మహత్తర పథకం అని వివరించారు. కానీ బనకచర్ల కడితే తెలంగాణతో పాటు ఆంధ్రాప్రాంతానికి సైతం నష్టమేనన్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు వచ్చే పోలవరం నీళ్లను రాత్రిరాత్రికే రాయలసీమకు తీసుకుపోయేందుకు చంద్రబాటు బనకచర్ల తెస్తున్నారన్నారు. గోదావరిలో వరద జలాలు ఉన్నాయని చంద్రబాబు చెబుతున్నది పచ్చి అబద్ధమన్నారు. కేసీఆర్ అపెక్స్ కమిటీ మీటింగ్‌లో 3000 టీఎంసీల వరద జలాలు ఉన్నాయని చెప్పింది మనం కాళేశ్వరం కట్టకముందు, ఎగువ రాష్ర్టాలు ప్రాజెక్టులు కట్టకముందన్నారు.
ఎగువ రాష్ర్టాల్లో ప్రాజెక్టులు రావడంతో ఇప్పుడు వరద జలాలు లేవన్నారు. నాలుగు డిపార్ట్మెంట్లు కేంద్ర జలసంఘం, ప్రాజెక్ట్ అప్రైసల్ కమిటీ, గోదావరి బోర్డు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పోలవరం నుంచి అన్ని వందల టీఎంసీలు బనకచర్లకు తీసుకుపోయే అవకాశం లేదని చెప్పి తిరస్కరించామన్నారు. కేంద్రంలోని మోదీ సర్కార్ కింద పని చేసే నాలుగు డిపార్ట్మెంట్లు వద్దు అంటే రేవంత్‌రెడ్డి పోయి ఎందుకు అప్పగిస్తున్నారో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. బనకచర్లపై కమిటీ, ఆ కమిటీ చెప్పినట్లు వింటానని రేవంత్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
తెలంగాణ ప్రాజెక్టులను తాను ఎప్పుడూ అడ్డుకోలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను అడుగడుగునా అడ్డుకున్నది చంద్రబాబు నాయుడే అన్నారు. ఇప్పుడు కూడా బనకచర్ల ప్రాజెక్ట్ కట్టి వరద జలాలతో పాటు, వరద జలాలపై తెలంగాణకు ఉన్న హక్కులను సైతం తరలించుకుపోయే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. మన నీళ్ల కోసం, నీళ్లపై హక్కుల కోసం తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో మరో జల సాధన ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మాట్లాడితే తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోలేదని చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ చెబుతున్నారని, వాస్తవానికి తెలంగాణ ప్రాజెక్టులకు అడుగడుగునా అడ్డుపడుతున్నది చంద్రబాబు నాయుడే అన్నారు.
ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని కేటీఆర్ బీఆర్ అంబేద్కర్ పేరుతో వార్ధా ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేస్తే చంద్రబాబు లేఖరాసి దాన్ని అడ్డుకున్నారన్నారు. తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేసే బనకచర్ల ప్రాజెక్ట్‌ను ఎట్టిపరిస్థితుల్లో ముందుకు సాగనివ్వమన్నారు. గోదావరిలో తెలంగాణ వాటా 968 టీఎంసీలుంటే.. ఇప్పటికీ 450 టీఎంసీలే వాడుకుంటున్నామన్నారు. బనకచర్ల పేరుతో మిగిలిన నీటిని ఆంధ్రాకు తరలించుకుపోయే కుట్రలో భాగమే బనకచర్ల అన్నారు. బనకచర్ల కడితే తెలంగాణ ఎడారిగా మారుతుందన్నారు.
గోదావరిపై ఏదైనా ప్రాజెక్ట్ కట్టాలంటే గోదావరి బోర్డు దగ్గర అప్లికేషన్ పెట్టాలి. అక్కడ ఫెయిలైతే అపెక్స్ కౌన్సిల్ దగ్గర పెట్టాలి. వీటన్నింటినీ బైపాస్ చేసి చంద్రబాబు మోదీతో ఉన్న పలుకుబడిని ఉపయోగించి నేరుగా ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని, ఆయన శిష్యుడు రేవంత్‌రెడ్డితో సంతకాలు పెట్టించుకొని ఈ దొంగ ప్రాజెక్ట్ కట్టాలనుకుంటున్నారని మండిపడ్డారు. దీనికి చట్టబద్ధత కోసమని మూడేళ్ల క్రితమే గోదావరి ట్రిబ్యునల్ కోసం దరఖాస్తు పెట్టుకున్నారన్నారు. ఒకవేళ ట్రిబ్యునల్ వస్తే తెలంగాణ వాటా 968 టీఎంసీలు ఉన్నా.. వాడుకుంటున్నది 450 టీఎంసీలే అని.. ఇంతకంటే ఎక్కువ వాడుకోడానికి లేదని మనల్ని కంట్రోల్ చేస్తుందన్నారు. ట్రిబ్యునల్ ఏర్పాటయ్యే లోపు బనకచర్ల పూర్తి చేసి 200 టీఎంసీల నుంచి 400 టీఎంసీలు ఏపీకి తరలించే కుట్రకు బాబు తెరలేపారన్నారు.
రేవంత్, బాబు కుట్ర చేసి తెలంగాణను ఎడారిగా మార్చాలని చూస్తున్నారన్నారు. ఆంధ్ర పెద్ద జీతగాడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండడం మన దురదృష్టమన్నారు. రేవంత్‌రెడ్డి మన నీళ్లను ఆంధ్రాకు తాకట్టు పెడుతున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రేవంత్ ఆంధ్రా కబంధ హస్తాల్లో తెలంగాణ అస్తిత్వాన్ని పెడుతున్నారని మండిపడ్డారు. బనకచర్లపై కమిటీ పేరుతో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ ముగ్గురు ఒక్కటై తెలంగాణకు శాశ్వతంగా అన్యాయం చేయబోతున్నారన్నారు. అందుకని ఈ కమిటీని వ్యతిరేకించడంతో పాటు, రాష్ట్రమంతా అగ్నిగోళం కావాల్సిన అవసరం ఉందన్నారు.
తెలంగాణ ప్రజలంతా ఉద్యమ స్ఫూర్తితో మళ్లీ వీధుల్లోకి వచ్చి మా నీళ్లు మాకే.. మా హక్కులు మాకే.. కావాలని కొట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ సర్కారు చేస్తున్న చారిత్రాక ద్రోహానికి యావత్ తెలంగాణ సమాజం ఎదురుతిరగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ విప్ బాల్కసుమన్, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజిత్‌రావు, రాజారమేశ్, బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.