కాగజ్‌నగర్, జూలై 13: సాగు నీటి ప్రాజెక్టులు, నీటి వనరులపై రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం చేస్తున్నదని, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. శనివారం కాగజ్‌నగర్ మండలంలోని ఈస్గం గ్రామ పరిధిలోని అడ ప్రాజెక్టు కాలువలు, చెరువులు, డ్యాంను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్నేళ్లుగా అసంపూర్తిగా ఉన్న అడ ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రూ.20 కోట్లు మంజూరు చేయాలన్నారు. చెరువుల కాలువల్లో పూడిక పేరుకపోయినా తీయించడం లేదని, చెరువుల గేట్లకు మరమ్మతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
అడ ప్రాజెక్టు కాలువలు తవ్వకాలతో కాంట్రాక్టర్ల జేబులు నిండాయి కానీ రైతులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. బెంగాలీ క్యాంపు నంబర్ 10లోని అప్పర్ డ్యాం, బెంగాలీ క్యాంపు నంబర్ 4లో లోయర్ డ్యాం, స్థానిక చెరువుల గ్రోయిన్ గేట్లు మరమ్మతులకు గురైనా పట్టించుకోవడం లేదన్నారు. కాలువలకు మరమ్మతు చేస్తే బెంగాలీ క్యాంపు పరిధిలోని సుమారు 3 వేల ఎకరాలకు సాగునీరందుతుందన్నారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సాగు నీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి చొరవ తీసుకొని రూ.20 కోట్లు మంజూరు చేయాలన్నారు. లేదంటే స్థానిక రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు లెండుగూరే శ్యామ్‌రావు, ఆవుల రాజ్‌కుమార్, కొండ రాంప్రసాద్, మిథున్ బిష్వాస్, నిత్యానంద్ మహంతు, కాశిపాక రాజు పాల్గొన్నారు.