నమస్తే నెట్వర్క్, ఏప్రిల్ 27: మరో చారిత్రక ఘట్టానికి వేదికైన వరంగల్ జిల్లా ఎల్కతుర్తికి గులాబీ దండు కదిలింది. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి, 25వ పడిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న రజతోత్సవ సభకు ఉప్పెనలా కదిలింది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీ మాజీ చైర్మన్లు, మున్సిపల్ మాజీ చైర్మన్లు, నియోజకవర్గ ఇన్చార్జులు, బీఆర్ఎస్ మండలాల అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పార్టీ జెండాలు ఆవిష్కరించి, వాహనాలను ప్రారంభించగా ఎల్కతుర్తి వైపునకు సాగాయి.
నాయకులు, కార్యకర్తలు, అభిమానులు దండులా తరలివచ్చి జై తెలంగాణ.. జైజై కేసీఆర్.. నినాదాలతో హోరెత్తించారు. ఏ దారి చూసినా గులాబీమయమై కనిపించింది. వేలాది వాహనాల్లో బయలుదేరి మధ్యాహ్నంకల్లా ఎల్కతుర్తికి పోటెత్తింది. అధినేతకు నీరా‘జనం’ పట్టి, ప్రసంగానికి మంత్రముగ్ధులైంది. భవిష్యత్ మనదేనన్న భరోసాతో కొత్త ఉత్సాహంతో సంతోషంగా వెనుదిరిగింది. ఆదిలాబాద్‌లోని మోచిగల్లీలో బీఆర్ఎస్ జెండాను మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రంగినేని మనీషా పవన్ రావు ఎగురవేశారు.
అనంతరం ప్రత్యేక వాహనంలో వరంగల్‌కు వెళ్లారు. నిర్మల్ మండలంలోని కొండాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి జడ్పీ మాజీ చైర్పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి, నిర్మల్ బీఆర్ఎస్ ఇన్చార్జి రాంకిషన్‌రెడ్డి జెండాను ఊపి బస్సులను వరంగల్‌కు ప్రారంభించారు. అంతకుముందు పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జెండాను ఆవిష్కరించారు. రజతోత్సవ సభకు తరలివెళ్లిన వారిలో జడ్పీ మాజీ చైర్మన్ లోలం శ్యాంసుందర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు భూషణ్‌రెడ్డి, నిర్మల్ బీఆర్ఎస్ కన్వీనర్ పీవీ మహేశ్‌రెడ్డి, లక్ష్మణచాంద మండల కన్వీనర్ కృష్ణారెడ్డి, మామడ చంద్రశేఖర్‌గౌడ్, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.