బెల్లంపల్లి, అక్టోబర్ 28 : ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి రాష్ర్టాన్ని అభివృద్ధి చేయలేక డైవర్షన్ పాలిటిక్స్‌కు కాంగ్రెస్ సర్కారు తెరలేపిందని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికెల శ్రావణ్ ఆరోపించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటిపై తనిఖీల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులతో దౌర్జన్యంగా దాడి చేయించిందని బెల్లపల్లిలోని పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద బీఆర్ఎస్వీ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. కేటీఆర్ బావమరిది ఫామ్‌హౌస్ సోదా చేసిన పోలీసులు, కేటీఆర్ ఇంటిపై దౌర్జన్యంగా దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కారణం, వారెంట్ లేకుండా సోదాలు ఎలా చేస్తారని మండిపడ్డారు.
ప్రతి పక్ష పార్టీ నేత ఇంటిపై పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తించడమేమిటని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి సోదరులపై చాలా ఆరోపణలున్నాయని, వారి ఇళ్లపై దాడులు చేసే దుమ్ముందా అని హెచ్చరించారు. మంత్రి పొంగులేటి ఇంట్లో విదేశీ వాచీల వ్యవహారం ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలే కేటీఆర్‌ను కాపాడుకుంటారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు రోషణ్, అరుణ్, ప్రసాద్, కిరణ్, సంతోష్, రాజు కుమార్ పాల్గొన్నారు.
చెన్నూర్, అక్టోబర్ 28: సీఎం రేవంత్‌రెడ్డి డైరెక్షన్లోనే హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇంటిపై పోలీసులు, ఎక్సైజ్‌శాఖ అధికారులు దాడులు చేశారని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ సాధనబోయిన కృష్ణ అరోపించారు. చెన్నూర్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ కేటీఆర్ బావమరిది నూతన గృహ ప్రవేశం చేసినందుకు దసరా, దీపావళి పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులకు విందు ఏర్పాటు చేస్తే, సీఎం డైరెక్షన్లో పోలీసులు, ఎక్సైజ్‌శాఖ వారు అక్కడ రేవ్ పార్టీ అని, అక్కడ డ్రగ్స్ అంటూ అక్కడ ఏమి లేకపోయిన, ఉన్నట్లు చిత్రీకరించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు, ఎక్సైజ్వారి కుట్రలను అడ్డుకునేందుకు వెళ్లిన బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో పాటు మరికొంత మంది ఎమ్మెల్యేలను, బీఆర్ఎస్ నాయకులను పోలీసు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని ఆయన ఆరోపించారు.
రుణ మాఫీ, రైతు బీమా, రైతు భరోసా, మహిళలకు నెలకు రూ 2,500, ఆసరా పింఛన్లను రూ 4,000పెంపు, కల్యాణ లక్ష్మి పథకంలో తులం బంగారం ఇస్తామని హామీలిచ్చారని ప్రజల్లో వ్యతిరేకతను, వారి దృష్టిని మళ్లించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కుట్రలకు, అక్రమ అరెస్టులకు భయపడకుండా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జడల మల్లేశ్, నెన్నెల భీమయ్య, ఎనగందుల ప్రశాంత్, కొప్పుల రవీందర్, నయాబ్, జడల వెంకన్న, ప్రశాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Durgam Chinnaih
బెల్లంపల్లి, అక్టోబర్ 28 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై బురదజల్లడం, ప్రజల దృష్టిని మళ్లించడంలో భాగంగానే ఆయన బావమరిదిపై డ్రగ్స్ కేసు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రచేస్తున్నదని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ఆయన నమస్తే తెలంగాణతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ కక్ష్య సాధింపు చర్యలకు ఇది పరాకాష్ట అని మండిపడ్డారు. జన్వాడ ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీలు జరిగాయంటూ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా ప్రచారాలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండు రోజుల ముందు నుంచే రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం శని, ఆదివారాల్లో బాంబులు పేలుతాయని పేర్కొనడం, చెప్పినట్లుగానే కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల, కేటీఆర్ ఇళ్ల పై దాడులు చేయడం ముందస్తుగా వేసిన స్కెచ్ అని ఆరోపించారు. వృద్ధులు, చిన్నపిల్లలు, భార్యాభర్తలు ఉన్న ఫ్యామిలీ ఫంక్షన్‌ను రేవ్ పార్టీగా, డ్రగ్స్ పార్టీగా చిత్రీకరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా నేరుగా ఎదుర్కొలేక కుటుంబ సభ్యులను అడ్డం పెట్టుకుని చీప్ పాలిటిక్స్ చేయడం మానుకోవాలని హితవు పలికారు.