నేరడిగొండ, డిసెంబర్ 14 : ‘గిరిజన ఎమ్మెల్యే అని చిన్న చూపా? అధికార ఎమ్మెల్యే కాకపోతే ఫ్లెక్సీలో ఫొటో పెట్టరా? ఎమ్మెల్యేను అవమానిస్తారా?’ అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. శనివారం లఖంపూర్ ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన కామన్ డైట్ కార్యక్రమంలో భాగంగా పాఠశాల గేటు వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ ఫొటో లేకపోవడంతో బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే అని చూడకుండా ప్రొటోకాల్ పాటించకుండా అవమానిస్తారా? అని అధికారుల తీరుపై ఎమ్మెల్యే అనుచరులు మండిపడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకున్నది. గేట్ వద్ద నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. అక్కడే బైఠాయించి ప్రభుత్వానికి, మంత్రికి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడికి ఇన్చార్జి మంత్రి సీతక్క రావాల్సి ఉండగా.. టెన్షన్ వాతావరణం నెలకున్నది. ‘కలెక్టర్ రావాలి.. న్యాయం చేయాలి..’ అంటూ నినాదాలు చేశారు.
అధికారులు ప్రొటోకాల్ పాటించకపోవడం నియోజవర్గ ప్రజలను అవమానించినట్టేనని అన్నారు. ఒక ఎమ్మెల్యేను కనీసం గేటు వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఫొటో లేకపోవడంపై ఎమ్మెల్యే లేడనకున్నారా? లేక గిరిజన ఎమ్మెల్యే అని చిన్నచూపు చూస్తున్నారా? అని ప్రశ్నించారు. ప్రతి పక్షంలో ఉన్న ఎమ్మెల్యేను అవమానించడం సరికాదని, ఎమ్మెల్యేకు కాదని ఇన్చార్జిలకు అధికారిక కార్యక్రమాల బాధ్యతలు అప్పగించడం సరికాదన్నారు. రోజు ఒక్కరిది కాదని ఏదో ఒకరోజు మాకు వస్తదని అప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికార పార్టీ నాయకులను హెచ్చరించారు. ఎమ్మెల్యే పదవికి గౌరవం ఇవ్వాలని కనీస పరిజ్ఞానం ఉండాలని, ఇలా చేసిన వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలిపారు. పార్టీ నాయకులందరూ శాంతించాలని ఎమ్మెల్యే కోరడంతో వారు ఆందోళన విరమించారు. చివరకు పార్టీ నాయకులందరూ గేటు బయటే ఉండగా, ఎమ్మెల్యే కార్యక్రమానికి హాజరయ్యారు.