మంచిర్యాల, మార్చి 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : “కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలో పడావుబడ్డ భూములన్నీ సస్యశ్యామలం అయ్యాయి. 15 రిజర్వాయర్లు, వేల కిలోమీటర్ల కాలువలు, వంద కిలోమీటర్ల సొరంగ మార్గాలు, నీటి ఎత్తిపోతలతో యావత్ ప్రపంచమే ఆశ్చర్యపోయేలా ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనత కేసీఆర్ సర్కారుది. అలాంటి విశ్వఖ్యాతి పొందిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ పనిగట్టుకొని దుష్ప్రచారం చేయడం సరికాదు. మరమ్మతులు చేస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నా పట్టించుకోకుండా రాజకీయాలు చేస్తున్నారు.
వరదలు వచ్చేలోగా దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. కాళేశ్వరంపై ఆధారపడి పంటలు వేసిన రైతుల ఆగమైపోతున్నారు. బీఆర్ఎస్పై కోపంతో రైతులను పగ పడుతారా.’ అని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు చలో కాళేశ్వరం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇతర ముఖ్యనాయకులు శుక్రవారం మేడిగడ్డ బ్యారేజ్‌ను పరిశీలించారు. ఇప్పటికైనా స్పందించకపోతే రైతుల ఆగ్రహానికి కాంగ్రెస్ పార్టీ గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో సాధ్యం కాని హామీలు ఇచ్చింది. వాటిని అమలు చేయకుండా జనం దృష్టిని మరల్చేందుకు కాళేశ్వరంపై అర్థంలేని ఆరోపణలు చేస్తుంది. తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కావాలనే పని గట్టుకొని విషప్రచారం చేస్తున్నది. మేడిగడ్డలో చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి పెద్దదిగా చూపిస్తున్నారు. బీఆర్ఎస్పై కోపముంటే రాజకీయంగా కొట్లాడాలి. కానీ లక్షలాది మంది రైతులను గోస పెట్టడం సరికాదు. మేడిగడ్డకు వెంటనే మరమ్మతులు చేసి తీరాలి. ఈ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. రైతులకు అండగా నిలుస్తాం.
వానకాలంలోగా రిపేర్లు పూర్తి చేయాలనే డిమాండ్‌తో ముందుకెళ్తున్నాం. సాగు నీరు పక్కన పెడితే కనీసం తాగేందుకు కూడా నీరు దొరకని పరిస్థితి ఉంది. గోదావరిలో నీళ్లు లేక జిల్లాలో బోర్లు, బావుల్లోనూ నీరు అడుగంటింది. అనవసర రాద్ధాంతాలు మాని మేడిగడ్డకు మరమ్మతులు చేస్తే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. హాయిగా కాళేశ్వరం నీళ్లు ఎత్తి పోసుకునేటోళ్లం. ప్రాజెక్టుల విషయంలో రాజకీయాలు పక్కన పెట్టి రైతులు, ప్రజల గురించి ఆలోచించాలని కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నా.
– బాల్క సుమన్, మాజీ ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు