ఆదిలాబాద్, మార్చి 23(నమస్తే తెలంగాణ) : ‘ఆదిలాబాద్ పట్టణంలోని తాంసి బస్టాండ్ ఎదుట రైల్వేగేటు మూసివేసి 76 రోజులు అవుతున్నది. బ్రిడ్జి పనులు ప్రారంభంకాలేదు. రెండు రోజుల్లో వంతెన పనులు ప్రారంభించకపోతే టిప్పర్లలో మొరం తీసుకొచ్చి తవ్విన గుంతను పూడ్చివేసి రాకపోకలు ప్రారంభిస్తాం..’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. సోమవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మూసివేసిన రైల్వేగేటు సమీపంలో స్థానికులు, వ్యాపారులతో కలిసి ధర్నా నిర్వహించారు.
ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శం కర్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రయోజనం పొందడానికి రైల్వే వంతెనను ప్రారంభిస్తున్నట్లు నాటకం ఆడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు జనవరి 4వ తేదీన కొబ్బరికాయ కొట్టి బ్రిడ్జి పనులు ప్రారంభించారు. అప్పటి నుంచి తాంసి బస్టాండ్ గేటు మూసివేశారని దీంతో పట్టణంలోని 13 వార్డులకు చెందిన వేలాది మంది, తాంసి, భీంపూర్ మండలాలకు చెందిన ప్రజలతోపాటు మహారాష్ట్రవాసులు రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పనులు ప్రారంభించాలని లేదా గేటును తీసి రాకపోకల కొనసాగించాలని స్థానికులు పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులను కోరినా ఫలితం లేదన్నారు.

భూసేకరణ చట్టం ప్రకారం ప్రక్రియ చేపట్టాలి..
రైల్వే వంతెన పనులు భూసేకరణ చట్టం ప్రకారం నిర్మాణ ప్రక్రియ చేపట్టాలని మాజీ మంత్రి జోగు రామన్న సూచించారు. నిబంధనల మేరకు మందుగా రైల్వే శాఖ నోటిఫికేషన్ జారీ చేయాలని, డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి ప్లగ్ మార్కింగ్ చేసి, ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి, అవార్డు పాస్ చేసి నిర్మాణ ప్రక్రియ ప్రారంభించాలన్నారు. తాంసి బస్టాండ్ వంతెన నిర్మాణంలో భాగంగా అధికారులు నిబంధనలు పాటించకుండా నష్టపరిహారం డబ్బులు ఇచ్చి ఇండ్లను కూల్చివేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. బాధితులకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం కలెక్టర్ రాజర్షి షాను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు యూనిస్ అక్బానీ, మెట్టు ప్రహ్లాద్, యాసం నర్సింగారావు, విజ్జిగిరి నారాయణ, వెనుకంటి ప్రకాశ్, సాజిదొద్దీన్, దాసరి రమేశ్, కలీం, అయ్యుబ్ పాల్గొన్నారు.