నార్నూర్, జూన్ 2 : కొమురం భీం జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మికి ప్రొటోకాల్ పాటించకుండా అవమానపరచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలిపారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి పలు కార్యక్రమాల ప్రారంభోత్సవానికి జిల్లాలో పర్యటించారు. ఆదివాసీసి మహిళ ఎమ్మెల్యే కోవలక్ష్మి విషయంలో ప్రొటోకాల్ పాటించకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటని దుయ్యబట్టారు. అధికారంలో ఏ ప్రభుత్వాలు ఉన్నా.. ఏ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు ఉన్న గౌరవించాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వంపై ఉంటుందన్నారు.
ఇలాంటి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఆ జిల్లా అధికారులు, నాయకులపై ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తో పాటు స్థానిక నాయకులు, అధికారులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీరామ్ జాదవ్, సహకార సంఘం చైర్మన్ ఆడే సురేష్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు కనక సత్యనారాయణ, మాజీ అధ్యక్షుడు ఉర్వేత రూప్ దేవ్, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ వైస్ మాజీ చైర్మన్ తోడసం నాగోరావు, నాయకులు సయ్యద్ ఖాసిం, రాథోడ్ సుభాష్, యశ్వంత్ రావ్, సుల్తాన్ ఖాన్, దయానంద్ తదితరులున్నారు.