సిర్పూర్(టీ), అక్టోబర్ 11 : కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న ఆరు గ్యారెంటీలేమోగాని.. సిర్పూర్(టీ) నియోజకవర్గ ప్రజల ప్రాణాలకు మాత్రం గ్యారెంటీ ఇవ్వాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం సిర్పూర్(టీ) నియోజకవర్గ కేంద్రంలోని సామాజిక దవాఖానను ఆయన సందర్శించారు. పలు వార్డులను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేరుకే పెద్ద దవాఖాన అయినా రోగులకు సరైన సేవలు అందడం లేదని, 17 మంది వైద్యులకుగాను కేవలం ఇద్దరు డ్యూటీ డాక్టర్లతోనే నెట్టుకొస్తున్నారన్నారు. చాలా కాలంగా ఎక్స్‌రే యంత్రం నిరుపయోగంగా ఉందని, ఆపరేషన్ థియేటర్ నిర్వహణ సరిగా లేదని, పారామెడికల్ సిబ్బంది, ఫార్మసిస్ట్ లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సామాజిక దవాఖాన దుస్థితే ఇలా ఉంటే.. ఇక పీహెచ్‌సీల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. సీఎంతో సహా మంత్రులు దవాఖానను సందర్శించాలని, పూర్తిస్థాయి వైద్యులతో పాటు పారామెడికల్, ఫార్మసిస్ట్లను నియమించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ నియోజకవర్గ కన్వీనర్ లెండుగురే శ్యాంరావ్, సిర్పూర్(టీ) బీఆర్ఎస్ కన్వీనర్ అస్లాం బిన్ అబ్దుల్, నాయకులు షేక్ చాంద్, లలిత, సైఫ్, తదితరులు పాల్గొన్నారు.