చెన్నూర్ పట్టణంలోని శనిగకుంట మత్తడిని డిటోనేటర్లు, జిలెటిన్‌స్టిక్స్‌తో పేల్చి ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకుడు రాజారమేశ్ డిమాండ్ చేశారు. ధ్వంసమైన శనిగకుంట మత్తడిని గురువారం పలువురు బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం చెన్నూర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఈ ఘటనపై ఏసీపీ, సీఐలు విచారణ జరిపి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. లేకపోతే సీపీ వద్దకు వెళ్తామని, అవసరమైతే మా నాయకులతోపాటు వెళ్లి ఐజీకి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ హయాంలో నియోజకవర్గంలోని చెరువులను అభివృద్ధి చేసి సుందరీకరణ చేశామన్నారు.
చెరువులో వెంచర్ వేసుకుని లాభపడాలనే దురుద్దేశంతోనే ఓ బడా కాంగ్రెస్ నాయకుడు శనిగకుంట మత్తడిని బాంబులతో ధ్వంసం చేశారన్న విషయం యావత్ చెన్నూర్ ప్రజలకు తెలుసన్నారు. ఎమ్మెల్యే వివేక్ ఆదేశాలతోనే రెండు రోజులుగా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఘటన జరిగినప్పుడే విచారణ ప్రారంభిస్తే కాంగ్రెస్ నాయకులు బయటపడుతారని.. ఇక్కడున్న కొంత మంది షాడో ఎమ్మెల్యేలు చెప్పింది విని ఎమ్మెల్యే వివేక్ ఆదేశాల మేరకు మూడు రోజులయ్యాక పోలీసులు హడావుడి చేస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే పేద దళితులను తీసుకొచ్చి రెండు రోజుల నుంచి పోలీస్ స్టేషన్లో కూర్చొబెట్టారన్నారు.
అమాయకులైన దళితులను వదిలేసి, ఎవరైతే ఈ దురాఘతానికి పాల్పడ్డారో, ఎవరైతే మందుగుండు సామగ్రిని అందించారో, పేలుడు పదార్థాలు ఇచ్చి పేల్చమని చెప్పారో వారిని పట్టుకుని శిక్షించాలన్నారు. చెరువును ఆనుకుని వెంచర్ వేసేది కోటపల్లి మండలంలోని సిర్సా గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు గొడిసెల బాపురెడ్డి అనే విషయం అందరికీ తెలుసునన్నారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి కుడిభుజంగా మెదులుతున్న వ్యక్తి అయినందునే ఆయన పేరు చెప్పడానికి పోలీసులు భయపడుతున్నారన్నారు.
ఆయనతోపాటు మరో షాడో ఎమ్మెల్యే (వెంచర్లో 25 శాతం వాటా ఉన్న వ్యక్తి) పేరు చెప్పటానికి వెనకాడుతున్నారన్నారు. ప్రజా పాలన అని చెప్తున్న కాంగ్రెస్ సర్కార్ ప్రజలను మోసం చేస్తూ పేద ప్రజలకు రోడ్డుకు లాగుతుందే తప్పా ఎక్కడ ప్రజలకు న్యాయం చేయడం లేదన్నారు. ఈ దుశ్చర్యతో చెరువు కిందున్న ఆయకట్టు రైతులు, మత్స్యకారులకు నష్టం జరిగిందన్నారు. వారికి ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా గత ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను ఈ వ్యవహారంలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారని రాజారమేశ్ మండిపడ్డారు. ఐదు సంవత్సరాల బాల్క సుమన్ కాలంలో ఏ రోజు బాంబు పేలిందో ప్రజలు ఆలోచించాలన్నారు. అనవసరంగా ఫేక్‌న్యూస్ పేర్లతో వాట్సాప్‌ల్లో మెస్సేజ్‌లు పెట్టి దుష్ప్రచారం చేస్తే సహించేది లేదన్నారు. ఎంత మర్యాదగా ఉంటారో, మేము అంతే మర్యాదగా ఉంటామని, ఇలాంటి పనులు చేస్తే చర్యకు ప్రతి చర్య తప్పదని హెచ్చరించారు.
పేద దళితులైతే ఎవరైతే పోలీసు స్టేషన్లో ఉన్నారో, వారిని ఉసిగొలిపిన వారు ఎందుకు బయట తిరుగుతున్నారని పోలీసులు సమాధానం చెప్పాలన్నారు. ఒక వేల ఎవరైనా బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఇలాంటి పనులకు పాల్పడితే వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నవాజొద్దీన్, కౌన్సిలర్లు రేవెల్లి మహేశ్, తుమ్మ రమేశ్, దోమకొండ అనీల్, జగన్నాథుల శ్రీను, మాజీ సర్పంచ్ సాధనబోయిన కృష్ణ, బీఆర్ఎస్ నాయకులు మేడ సురేశ్‌రెడ్డి, నాయిని సతీశ్, అరీఫ్, తాటికొండ సురేశ్ పాల్గొన్నారు.