నిర్మల్ అర్బన్, జూన్ 20 : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ డీసీసీబీ చైర్మన్ చిక్యాల హరీశ్‌రావు కిడ్నాప్ హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. మామడ మండలం పొన్కల్ గ్రా మానికి చెందిన ప్రధాన నిందితుడైన షేక్ హై దర్ (బీజేపీ మైనార్టీ మోర్చా కన్వీనర్) గతం లో చిక్యాల హరీశ్‌రావు వద్ద డ్రైవర్‌గా పని చేసేవాడు.
ఇతని ప్రవర్తన నచ్చక 6 నెలల క్రితం పనిలోంచి తీసేశాడు. దీంతో హరీశ్‌పై హైదర్ పగ పెంచుకుని కిడ్నాప్ చేసేందుకు ప్లాన్ వేశాడు. ఈ క్రమంలో హైదర్ మిత్రుడైన గుంటూరుకు చెందిన బానాల ప్రిన్స్, విజయవాడకు చెందిన తట్టూరి రవి, కళకంటి సురేశ్, కోటేశ్వర్ రావు, పొన్కల్‌కు చెందిన మధుసూదన్ నిందితులుగా ఉన్నారు. హరీశ్‌ను కిడ్నా ప్ చేసేందుకు వీరందరూ ముందుగానే ప్లాన్ వేసుకున్నారు. పొన్కల్‌కు చెందిన మధుసూదన్ హరీశ్‌రావుకు సంబంధించిన రాకపోకలను వారికి తెలిపారు. కిడ్నాప్ చేసేందుకు రెండు కార్లు అద్దెకు తీసుకుని ఈ నెల 15న అర్ధరాత్రి అతని ఇంటికి చేరుకున్నారు.
హరీశ్‌రావు ఇంటిపై కప్పు ద్వారా లోపలికి ప్రవేశించి అతని చేతులు, కాళ్లు కట్టేసి, నోరు మూసి బెదిరించి బంగారు చైన్, బంగారు బిల్లలు, డైమండ్ ఉంగరం, రూ.5 వేల నగదును దొంగలించి బాధితుని కారులో కిడ్నాప్ చేసి హైదరాబాద్ వైపు తీసుకెళ్లారు. ఈ క్రమంలో అతన్ని కత్తులతో బెదిరించి బంధువులకు ఫోన్ చేయించి రూ.3 కోట్లు డిమాండ్ చేశారు. టోల్ ప్లాజా వద్ద కార్ పాస్టాగ్ స్కాన్ కాకపోవడంతో కారును ఆపగా అదే అదునుగా చూసుకుని హరీశ్‌రావు కారులోంచి దూకి పరారయ్యాడు.
దొరికిపోతామని అనుకున్న నిందితులు టోల్గేట్ గేట్‌ను విరగ్గొట్టి కొద్ది దూరం వెళ్లిన తర్వాత వదిలేసి కిరాయి కారులో దోచుకున్న సొత్తుతో ఉడాయించారు. జిల్లా ఎస్పీ 5 ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి నాలుగు రోజుల్లోనే నిందితులను పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి కిడ్నాప్‌నకు వాడిన కారు బంగారు చైన్, పర్సు, రూ.2 వేల నగదు, 6 సెల్ఫోన్లు, రెండు కత్తులు, ప్లాస్టర్, వదిలి వేసిన కారును స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన ఏఎస్పీ రాజేశ్ మీనాను, సీఐలు గోవర్ధన్ రెడ్డి, కృష్ణ, సమ్మయ్య, ఎస్ఐలు ప్రదీప్, శ్రీనివాస్, లింబాద్రి, శ్రీకాంత్, అశోక్, పోలీసులను అభినందించారు.