మంచిర్యాల, (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/రామకృష్ణాపూర్/జైపూర్, ఆగస్టు 25: ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై పోరాటం చేద్దామని బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పిలుపునిచ్చారు. ఆచరణ సాధ్యంకాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారును ఊరూరా నిలదీయాలన్నారు. కేసీఆర్ సర్కారులో చేసిన అభివృద్ధిని, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూనే.. 20 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు.
సోమవారం క్యాతన్‌పల్లిలోని తన నివాసంలో బీఆర్ఎస్ పార్టీ చేపట్టనున్న “అప్పుడే మంచిగ ఉండే” కార్యక్రమంపై పార్టీ కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు-అమలుపై ప్రజాభిప్రాయాన్ని ఫిర్యాదుల రూపంలో సేకరించే ఈ మహత్తర కార్యక్రమం చెన్నూర్ నియోజకవర్గం నుంచే మొదలవుతుందన్నారు. ఇందుకు అవకాశం కల్పించిన బీఆర్ఎస్ నాయకత్వానికి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. చెన్నూర్‌లో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి.. మార్గదర్శకంగా నిలవాలని కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు.
ఆయన మాట్లాడుతూ హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఏ ఊరులో.. ఎవరెవరికి ఇచ్చారు.. ఎందరికి ఇచ్చారో నాకంటే బాగా మీకే తెలుసన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, వాళ్ల బంధువులకే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారని, చివరకు ఇందిరమ్మ ఇండ్లను సైతం అమ్ముకున్నారంటూ మండిపడ్డారు. దీనిపై గ్రామాల్లో చర్చ పెట్టి, ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలన్నారు.
బాల్క సుమన్ ఉన్నప్పుడు మంచిర్యాల జిల్లాలో ఎరువుల కోసం క్యూలో చెప్పులు కనిపించాయా.. అని ప్రశ్నించారు. మా నాన్న సి కింద్రాబాద్ యశోద హాస్పిటల్లో వెంటిలేటర్‌పై ఉంటే.. అక్కడ ఆయన్ని వదిలేసి వచ్చి మరీ ఇక్కడ రివ్యూలు పెట్టి రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకున్నామన్నా రు. కానీ, ఈ రోజు మంత్రికి, ఎమ్మెల్యేలకు రైతులు యూరి యా కోసం క్యూ కడితే కనిపించడం లేదన్నారు. కిష్టంపేట మిల్లులో సీసీఐ పత్తి కొనకపోతే రైతులు రాస్తారోకో చేశారని, అయినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. మనం అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు లేవని గుర్తు చేశారు.
బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి..
బీఆర్ఎస్ హయాంలో చెన్నూర్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామన్నారు. మందమర్రిలో రూ.500 కోట్లతో పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేటీఆర్‌ను తీసుకువచ్చి శంకుస్థాపన చేయించామని, దానిని పట్టించుకునే వారు లేక అది బెల్లంపల్లికి తరలిపోయిందన్నారు. రూ.1650 కోట్లతో చెన్నూర్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తే అది ఆగిపోయిందన్నారు. సుద్దాలలో రూ.15 కోట్లతో బ్రిడ్జి కట్టించానన్నారు.
బొక్కలగుట్టలో బ్రిడ్జి, గాంధారి మైసమ్మ జాతరకు పోయేందుకు రోడ్డు నిర్మించామన్నారు. రూ.500 కోట్లతో గాంధారి వనాన్ని కేసీఆర్ అర్బన్ పార్క్‌గా అభివృద్ధి చేసే ప్రాజెక్ట్‌ను సైతం మొదలు పెట్టామన్నారు. కోటపల్లి మండలంలో తంతుంగ వాగుపై రూ. 8.50 కోట్లతో బ్రిడ్జి కడితే.. ఏదుల్లబంధం, పుల్లగామ, సిర్సా, రొయ్యలపల్లి, ఆల్గామా, సుపాక, జనగామ ప్రజలకు మంచి జరుగుతుందని తాపత్రయ పడ్డానన్నారు. మంత్రి వివేక్ గ్రామాల్లోకి వస్తే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన చెప్పిన మాటలన్నీ గుర్తు చేయాలన్నారు. న్రియోజకవర్గంలో 45 వేల ఉద్యోగాలు, అగ్రికల్చర్, మైనింగ్ ఇనిస్టిట్యూషన్లు, సింగరేణి ఫ్యాక్టరీలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏమయ్యాయో జనం అడగాలన్నారు.
వార్ వన్ సైడ్..
“అప్పుడే మంచిగ ఉండే” కార్యక్రమంలో భాగంగా 50 శాతం ఓటర్ల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు సహా, ఇతర హామీల కింద ఏదైనా లబ్ధి చేకూరిందా లేదా.. అని లబ్ధిదారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటామన్నారు. ఇలా వచ్చిన ఫిర్యాదులన్నింటినీ స్వీకరించి కలెక్టర్‌కు అందజేస్తామన్నారు. ఈ నెల 28న చెన్నూర్, మందమర్రి, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలతో పాటు భీమారం, జైపూర్ మండల కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు.
అనంతరం 15 రోజుల పాటు కార్యక్రమం కొనసాగుందని, మనం సరిగ్గా దృష్టి పెడితే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్ వన్‌సైడ్ అవుతుందన్నారు. ప్రజల కోసం పని చేసుకుంటూ పోయినప్పుడే మనల్ని విశ్వసిస్తారని.. అప్పుడే సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు అవుతారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ చెన్నూర్ నియోజకవర్గ నాయకులు డాక్టర్ రాజారమేశ్, రిక్కుల మధూకర్‌రెడ్డి, రవీందర్, రాంలాల్ గిల్డాతో పాటు నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జైపూర్ మండలం వేలాల గ్రామానికి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టిలో చేరినవారిలో బీజేపీ మండల ప్రధానకార్యదర్శి వేముల తిరుపతిగౌడ్, వేలాల గ్రామానికి చెందిన కాంగ్రెస్‌పార్టీ రైతు సమితి కో ఆర్డినేటర్ సోదరి బాపు ఉన్నారు.