ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో మత్స్యకారులు ఉపాధి కోల్పోవాల్సి వస్తున్నది. చేప పిల్లల పంపిణీలో జాప్యం కారణంగా చేపలు పెరగకపోగా జిల్లాలో అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో పలు చెరువుల్లో చేపలు చనిపోయి మత్స్యకార్మికుల ఉపాధి దెబ్బతింటున్నది. ఇటీవల మావల చెరువులో 3 టన్నుల చేపలు చనిపోయి రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం నీలి విప్లవంలో భాగంగా చెరువుల్లో ఉచితంగా చేపల పెంపకం పథకాన్ని ప్రారంభించింది. గత ప్రభుత్వం అమలు చేసిన ఈ పథకం మత్స్యకారులను ఉపాధిని పెంపొందించేందుకు ఎంతో ఉపయోగపడింది. అప్పట్లో జిల్లాలో 224 చెరువుల్లో 1.23 కోట్ల చేప పిల్లలను వదిలారు. ఆదిలాబాద్ జిల్లాలోని సాత్నాల, మత్తడి ప్రాజెక్టులతో పాటు చెరువుల్లో వేసిన చేప పిల్లలు బాగా పెరిగాయి. సకాలంలో పిల్లలు పంపిణీ చేయడంతో పాటు మత్స్యకారులకు వలలు, ఇతర సామగ్రి, మార్కెటింగ్ కోసం ఫోర్, టూ వీలర్ వాహనాలను సైతం పంపిణీ చేసింది.
ఏటా వానకాలం ప్రారంభానికి ముందు జిల్లాలో చేప పిల్లల పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేస్తుండగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో జాప్యం జరుగుతున్నది. పిల్లల పంపిణీకి టెండర్ల నిర్వహణ ఇతర ప్రక్రియలో ఆలస్యం కారణంగా చేపలను చెరువుల్లో వదలడంలో తీవ్ర జాప్యమవుతున్నది. దీంతో పాటు ప్రభుత్వం తక్కువ చెరువుల్లో పిల్లలను వదులుతున్నది. గతేడాది జిల్లాలో 80 లక్షల చేప పిల్లలు పంపిణీ చేశారు. జూలైలో పంపిణీ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా అక్టోబర్లో ప్రారంభించి ముగించారు. వానకాలం సీజన్ ప్రారంభంలో చేప పిల్లలను వదిలితే కొత్త నీటిలో లభించే ఆహారం కారణంగా బాగా పెరుగుతాయని మత్స్యకారులు అంటున్నారు. సీజన్ అయిపోయిన తర్వాత పిల్లలను వదలడంతో నీటి వనరుల్లో నీరు ఎండిపోయి చేప పిల్లలు ఎదగకుండా పోతున్నాయంటున్నారు. దీంతో తమకు ఉపాధి కరువైందని తెలిపారు. ఒక్కో చేప 300 గ్రాములు సైతం పెరగలేదని తెలిపారు. ప్రభుత్వం చేప పిల్లలను సకాలంలో పంపిణీ చేస్తేనే ఉపాధి లభిస్తుందని అంటున్నారు. ఈ ఏడాదైనా చెరువులు నిండిన వెంటనే అందించాలని కోరుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలోని మావల కొత్త చెరువులో ఎండ వే డిని తట్టుకోలేక పెద్ద సంఖ్యలో చేపలు మరణించాయి. ఈ చెరువులో మత్స్యకారులు సొంత డబ్బులతో చేపల పెంపకాన్ని చేపట్టారు. ప్రభుత్వం సైతం చేపపిల్లలను పం పిణీ చేసింది. ఎండ తీవ్రత అధికంగా ఉండడం వేడి ఎ క్కువకావడంతో పాటు అడుగు భాగంలో గడ్డి ఎక్కువ గా ఉండడంతో నీటిలో ఆక్సిజన్ లభించక చేపలు మ రణించినట్లు మత్స్యకారులు తెలిపారు. ఒక్కో చేప 5 కిలోల వరకు బరువు ఉంటుందని 3 టన్నుల చేపల చనిపోగా రూ.5లక్షల వరకు నష్టం జరిగిందని పెం పకం దారులు తెలిపారు. దీంతో తాము ఉపాధి కోల్పోవాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వం పరిహారం అందించాలని కోరుతున్నారు.
ప్రభుత్వం మత్స్యకారులకు ఉచితంగా పంపిణీ చేస్తున్న చేప పిల్లలు సకాలంలో అందకపోవడంతో ఉపాధి కోల్పోతున్నాం. వర్షాలు పడి చెరువులు నిండిన వెంటనే పంపిణీ చేస్తే ఆహారం బాగా లభించి ఎక్కువ బరువు పెరుగుతాయి. ఆలస్యంగా పంపిణీ చేయడంతో బరువు పెరగక చనిపోతున్నాయి. గతేడాది అక్టోబర్లో మావల కొత్త చెరువులో 50 వేల పిల్లలను వదిలారు. ఒక్కో చేప 200 గ్రాములు కూడా పెరగలేదు. చెరువులు నిండిన వెంటనే పంపిణీ చేస్తే కిలోన్నర, రెండు కిలోల బరువు పెరిగేవి. ఎండల కారణంగా కొత్త చెరువులో మేము పెంచుతున్న చేపల్లో 3 టన్నుల చేపలు చనిపోయి రూ.5 లక్షల నష్టం జరిగింది. తమకు ప్రభుత్వం సాయం అందించి ఆదుకోవాలి.