మంచిర్యాల ప్రతినిధి(నమస్తే తెలంగాణ)/మంచిర్యాల టౌన్, ఆగస్టు 18 : జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయంలో శనివారం బీఆర్ఎస్ కౌన్సిలర్ బేర సత్యనారాయణ కత్తితో గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. వివరాలిలా.. నస్పూరు మున్సిపాలిటీలో 21వ వార్డు కౌన్సిలర్‌గా ప్రాతినిథ్యం వహిస్తున్న బీఆర్ఎస్ కౌన్సిలర్ బేర సత్యనారాయణను ఓ కేసు విషయమై ఏసీపీ తన కార్యాలయానికి పిలిపించారు. ఈ క్రమంలో బేర సత్యనారాయణ అక్కడే ఉన్న కేక్ కట్‌చేసే కత్తితో గొంతు కోసుకున్నాడు. వెంటనే పోలీసులు స్థానిక ప్రైవేట్ దవాఖానకు తరలించారు. కాగా, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావే తనపై కక్ష్యకట్టి అక్రమ కేసులు పెట్టిస్తున్నారని, గతంలో కూడా కేసులు పెట్టించారని, పోలీసులు తనతో అతిగా ప్రవర్తించారని బేర సత్యనారాయణ ఆరోపించారు. నస్పూరు మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 14లో ఏర్పాటు చేసిన వెంచర్లో మురుగు కాలువను ఆక్రమించారని వచ్చిన ఫిర్యాదు మేరకు నస్పూరు మున్సిపల్ కమిషనర్ సతీష్ అక్కడికి వెళ్లి విచారణ జరిపారు.
కాలువ కబ్జా అయ్యిందని నిర్ధారించుకున్న కమిషనర్ మురుగు కాలువలో వేసిన మట్టిని తవ్వించి యథావిధిగా మార్చారు. ఈ విషయం తెలుసుకున్న బేర సత్యనారాయణ మళ్లీ కాలువలో మట్టి పోసి ఆక్రమించుకున్నాడని తెలియడంతో కమిషనర్ సతీష్ తిరిగి అక్కడికు చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడ కమిషనర్‌తో పాటు ఫిర్యాదు చేసిన వ్యక్తులు, కౌన్సిలర్ మధ్య మాటామాటా పెరిగింది. బేర సత్యనారాయణ తనను కులంపేరుతో దూషించారని, విధులకు ఆటంకం కలిగించారని కమిషనర్ సతీష్ నస్పూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే కమిషనర్‌తో అసలు మాట్లాడనే లేదని, కావాలనే తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని బేరసత్యనారాయణ ఆరోపిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉన్న తనను పోలీసులు బలవంతంగా మంచిర్యాలకు తీసుకువచ్చారని ఆయన తెలిపారు.
నస్పూరు మున్సిపల్ కౌన్సిలర్ బేర సత్యనారాయణను ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులో విచారణ కోసమే పిలిపించామని మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాశ్ తెలిపారు. శనివారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని సత్యనారాయణ కుటుంబ సభ్యులు ఆరోపించడం సరైనది కాదని, తాను ఇక్కడకు వచ్చి ఆరునెలలే అయిందని, అంతకన్నా ముందు సత్యనారాయణపై ఏడెనిమిది కేసులున్నాయని ఆయన తెలిపారు. అంతకుముందు కూడా ఎస్సీ,ఎస్టీ కేసు నమోదైందని, కోర్టులో నడుస్తున్నదని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ సతీష్ ఇచ్చిన కేసు విషయంలో విచారణకు రావాలని పిలిచినా రాలేదని, అందుకే పోలీసులు వెళ్లి తీసుకువచ్చారని తెలిపారు. గొంతుకోసుకుని కేసును దారిమళ్లించాలని చూస్తున్నారని, విచారణకు అతను రాలేని పక్షం లో తన తరపున ఎవరినైనా పంపించాల్సి ఉంటుందన్నారు.
నస్పూరు మున్సిపల్ కమిషనర్ బేర సత్యనారాయణపై అక్రమ కేసు పెట్టిన పోలీసులు, మున్సిపల్ కమిషనర్‌పై ఆయా శాఖల ఉన్నతాధికారులు పూర్తి స్థాయి విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులే లక్ష్యంగా, వారిని ఇబ్బందులకు గురిచేసే చర్యలు సాగుతున్నాయన్నారు.
ఏసీపీ కార్యాలయంలో గొంతుకోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కౌన్సిలర్ బేర సత్యనారాయణ, మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్ మధ్య దవాఖానలో జరిగిన సంభాషణ హాట్ టాపిక్‌గా మారింది. ఇరువురి మధ్య మాటల యుద్ధం సాగింది. కేసుకు సంబంధించిన విషయాలను చర్చించడం ఆసక్తిగా మారింది. సత్యనారాయణ చికిత్స పొందుతున్న ప్రైవేట్ హాస్పిటల్‌కు చేరుకున్న ఏసీపీ ప్రకాశ్ సత్యనారాయణను ఉద్దేశించి ‘నేను కావాలని కేసు పెట్టానని అనడం సరికాదు. నీ మీద కేసు వచ్చింది కాబట్టే విచారణకు రావాలని పిలిచాను. నీ మీద 10 కేసులు ఉన్నాయి. ఇప్పుడు తీసిన. కానీ ఇలా చేసుకోవడం సరికాదు.’ అన్నారు. ఈ విషయంలో ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది.
సత్యనారాయణ మాట్లాడుతూ ‘నా మీద ఉన్న కేసుల్లో ఒక్కటీ సరైందికాదు. కావాలని పెట్టినవే. వాటిని నిరూపించలేరు. రుజువు చేస్తే దేనికంటే దానికి సిద్ధం. కానీ నీ మీద కూడా సవాలక్ష ఆరోపణలు ఉన్నాయి. ప్రకాశ్ అంటేనే లంచగొండి అని ఉంది. ప్రేమ్‌సాగర్‌రావుపై వంద కేసులు ఉన్నాయి. ఆయనకు ఎందుకు సెల్యూట్ కొడుతున్నావ్. ఊడిగం ఎందుకు చేస్తున్నావ్’ అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారుడిని నేను, బీసీ బిడ్డను, దొరలు కావాలని నామీద కావాలనే కేసులు పెట్టిస్తున్నారు. అంటూ సంభాషణ కొనసాగింది.