మందమర్రి, నవంబర్ 4 : మందమర్రి పట్టణంలోని సింగరేణి పాఠశాల ఆవరణలో ఈ నెల 7న నిర్వహించే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని చెన్నూర్ బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పిలుపునిచ్చారు. మందమర్రి పట్టణంలోని బీఆర్ఎస్ బీ1 కార్యాలయం వద్ద శనివారం పార్టీ యువజన, విద్యార్థి సంఘాలు, సోషల్ మీడియా నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో యువకులు పాల్గొని, బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు.
సీఎం కేసీఆర్ సభలో వలంటీర్లుగా వ్యవహరించి, సభకు వచ్చే ప్రజలకు సేవలందించాలని అన్నారు. సమావేశంలో చెన్నూర్ ప్రగతి ప్రస్థానం పుస్తకాన్ని ఆవిష్కరించారు. పుస్తకంలో పొందుపరిచిన అంశాలను వివరించారు. ప్రతి ఒక్కరూ ప్రగతి ప్రస్థానం పుస్తకాన్ని చదివి, అందులోని అభివృద్ధి, సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించి చైతన్యం కలిగించాలని కోరారు. కష్టపడే యువకులకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు.
మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డులకు చెందిన 200 మంది యువకులు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకానితో కలసి ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు జరిపిన అభివృద్ది, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అనేక మంది పార్టీలో చేరుతున్నారని ఆయన తెలిపారు. పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జే రవీందర్, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.