రామకృష్ణాపూర్, ఏప్రిల్ 20 : సొమ్మొకరిది.. సోకొకరిది.. అన్న చందంగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రగతిని పట్టించుకోకపోగా, కేసీఆర్ సర్కారు చేసిన పనులకు కొబ్బరికాయలు కొడుతూ.. ప్రారంభోత్సవాలు చేస్తూ.. గొప్పలు చెప్పుకుంటున్నది. బీఆర్ఎస్ హయాంలోనే రామకృష్ణాపూర్ రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి దాదాపు పూర్తికాగా, ఇటీవల కేవలం పది శాతం పనులు చేసి బిల్డప్ ఇస్తున్న ‘హస్తం’ నేతల తీరు విమర్శలకు తావిస్తున్నది.
బాల్క సుమన్ వచ్చాకే బ్రిడ్జి పనులు..
కేంద్ర ప్రభుత్వం 2013- 2016 మధ్యకాలంలో క్యాతనపల్లి రైల్వే బ్రిడ్జికి రూ.31 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటనలు వెలువడ్డాయి. సుమారు రూ.4.10 కోట్లతో పనులు సైతం మొదలు పెట్టారు. కానీ భూ సేకరణకు నిర్వాసితులు నిరాకరించడం, భూములు ఇవ్వకపోవడంతో జాప్యం జరిగింది. చెన్నూరు ఎమ్మెల్యేగా బాల్క సుమన్ గెలిచాక భూసేకరణపై ప్రత్యేక దృష్టి సారించారు. అప్పటికే భూములు ఇవ్వమని నిర్వాసితులు కోర్టుకు వెళ్లారు. ఆందోళనలు చేశారు.
ఒకానొక దశలో కొట్లాటలు, వివిధ పార్టీల ఆందోళనలు అన్నింటినీ ఎదుర్కొని భూసేకరణ పూర్తి చేయించారు. చివరకు 2018 ఆగస్టులో కాంట్రాక్టర్‌తో అగ్రిమెంట్ జరిగింది. రైల్వే బ్రిడ్జికి అనుసంధానంగా రోడ్డు నిర్మాణానికి రూ.27.5 కోట్ల నిధులు మంజూరయ్యాయి. భూవివాదాలన్నీ సమసిపోయి 2019 జూలైలో పనులు మొదలయ్యాయి. 2020 మార్చిలో కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్లు పనులు నిలిచిపోయాయి.
ఈ సమయంలో బ్రిడ్జి నిర్మాణంలో మార్పులు చోటు చేసుకోవడంతో అదనంగా రూ.7.50 కోట్ల నిధులు మంజూరు చేయించారు అప్పటి ఎమ్మెల్యే బాల్కసుమన్. వెంటనే పనులు మొదలుపెట్టించి 2024 అసెంబ్లీ ఎన్నికల నాటికి 90 శాతం పనులు పూర్తి చేయించారు. ఇంతలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పనులు మళ్లీ జాప్యమయ్యాయి. 10 శాతం పనులు చేయడానికి 16 నెలల సమయం పట్టింది. ఎట్టకేలకే రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభమైంది. ఇది ముమ్మాటిటీ గత ప్రభుత్వ హయాంలో జరిగిన కృషి ఫలితమే అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్రారంభోత్సవానికి హడావుడి చేసి గొప్పలు చెప్పుకున్న నాయకులు.. ప్రారంభించి ఐదురోజులు పూర్తి కావస్తున్నా ఇప్పటి వరకు బ్రిడ్జిపై విద్యుద్దీపాలు అమర్చలేకపోయారు. దీంతో రాత్రి వేళ బ్రిడ్జిపై ప్రయాణం చేయడానికి ఇబ్బందులు పడాల్సి వస్తుందని స్థానికులు వాపోతున్నారు. ప్రారంభించిన రెండు రోజులకే రైల్వే అధికారులు రైల్వే గేటును శాశ్వతంగా మూసివేశారు. విద్యుద్దీపాలు లేని ైప్లె ఓవర్‌పై ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారని జనాలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక అధికార పార్టీ లీడర్లు, అధికారులపై ఈ విషయంపై దృష్టి సారించాలని కోరుతున్నారు.
బ్రిడ్జిపై ప్రయాణం సుమన్ కృషి ఫలితమే
రామకృష్ణాపూర్ పట్టణ ప్రజల ఏళ్లనాటి కల క్యాతనపల్లి రైల్వే ైప్లెఓవర్ బ్రిడ్జి నిర్మాణం. ఎంతో మందిని బలిగొన్న రైల్వే గేటు కష్టాలను తొలిగించి, దాని స్థానంలో బ్రిడ్జి నిర్మాణం చేయడం బాల్క సుమన్ కృషి ఫలితమే. బ్రిడ్జిపై ప్రయాణాలు సాగించే ప్రతి ఒక్కరూ ఆయననే గుర్తు చేసుకుంటారు. క్యాతనపల్లిని మున్సిపాలిటీగా చేసి, పట్టణంలో నివాసముంటున్న 4 వేల మందికి సింగరేణి ఇండ్ల పట్టాలు ఇప్పించిన ఘనత గత ప్రభుత్వానికే దక్కుతుంది.
– కంభగోని సుదర్శన్‌గౌడ్,బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు, రామకృష్ణాపూర్
విద్యుద్దీపాలు ఏర్పాటు చేయాలి
క్యాతనపల్లి రైల్వే ైప్లె ఓవర్ బ్రిడ్జిపై విద్యుద్దీపాలు ఏర్పాటు చేయలేదు. రాత్రివేళ ప్రమాదాలు జరిగితే బాధ్యులు ఎవ రు. గతంలో బ్రిడ్జి నిర్మా ణంలో జాప్యం జరుగు తుందని కావాలనే గగ్గో లు పెట్టిన నాయకులు ఇప్పుడు విద్యుద్దీపాలు ఏర్పాటు చేయకుండానే ప్రారంభించడం శోచనీయం. ఆర్భాటంగా బ్రిడ్జిని ప్రారంభించి ప్రజల రక్షణను గాలికి వదిలేశారు. ఇప్పటికైనా బ్రిడ్జిపై లైటింగ్ ఏర్పాటు చేయాలి.
– రామిడికుమార్, రామకృష్ణాపూర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు