మందమర్రి/మంచిర్యాలటౌన్/జైపూర్, జూన్ 1: ప్రజాస్వామ్యంలో అన్యాయాలను ప్రశ్నించే హక్కు లేదా ? సింగరేణి లో కుంభకోణాలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైలుకు పం పుతారా ? అంటూ కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకుల ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ విప్ బాల్క సుమన్ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు, నిరసన ర్యాలీలు చేపట్టారు. సోమవారం సిం గరేణి మందమర్రి ఏరియాలోని కేకే-5 గని పై యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా టీబీజీకేఎస్ మందమర్రి ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్ మాట్లాడుతూ మాజీ విప్ బాల్క సుమన్ సింగరేణి ప్రస్తుత స్థితిగతులను వివరిస్తూ సింగరేణిలో పెద్ద ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని, నాయకులు, కార్యకర్తలను ఉత్తేజ పరిచే విధంగా వ్యాఖ్యలు చేశారే తప్ప ఎలాంటి రెచ్చగొట్టే ప్రసంగం చేయలేదన్నారు. కానీ బాల్క సుమన్ వ్యాఖ్యలను వక్రీకరించి కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదుల మేరకు అక్రమంగా కేసులు నమోదు చేసి జైలుకు పంపారని తెలిపారు. అక్రమాల నుంచి కార్మికుల దృష్టిని మరల్చే కుట్రలో భాగంగా బా ల్క సుమన్ పై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. వెంటనే బాల్క సుమన్‌ను విడుదల చేయాలని, లేదంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరిం చారు.
ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ గని పిట్ కార్యదర్శి వీరారెడ్డి, కేంద్ర నాయకులు బాబురావు, మధుసూదన్ రెడ్డి, శివ నాయక్ తదితరులు పాల్గొన్నారు. బాల్క సుమన్ అరెస్టును నిరసిస్తూ మంచిర్యాలలో ఓవర్‌బ్రిడ్జి వద్ద బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేశారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, రాష్ట్ర నాయకులు విజిత్‌రావు ఆదేశాల మేరకు చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, బండి రమేశ్, పానగంటి సత్తయ్య, పెట్టెం లక్ష్మణ్, నాయకులు గోగుల రవీందర్‌రెడ్డి, అంకంనరేశ్, ఎర్రం తిరుపతి, వంగ తిరుపతి, మేరుగు పవన్, పూదరి కుమార్, కాటంరాజు, మధు, కార్పొరేటర్లు గుమ్మడి శ్రీనివాస్, అబ్దుల్‌సత్తార్, తదితరులు పాల్గొన్నారు. జైపూర్ మండలకేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు నిరసన ర్యాలీ తీశారు. వారిని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. పలు గ్రామాల్లో అరికె సంతోష్, మేడి తిరుపతి, ఆర్నె సమ్మయ్య, మాజీ ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేశారు. ఈ నిరసనలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బల్మూరి అరవిందరావు, నాయకులు బడుగు రవి, కొరివి శేఖర్‌యాదవ్, సోషల్‌మీడియా నాయకులు దూట శేఖర్, కార్యకర్తలు, తదితరులున్నారు.