రెబ్బెన, ఏప్రిల్ 18 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని పాసిగాం గ్రామ శివారులో గల పూలాజీ బాబా ఆశ్రమంలో నాలుగేండ్ల క్రితం జరిగిన బాలుడు రిషి డెత్ మిస్టరీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆసిఫాబాద్ డీఎస్పీ సదయ్య తెలిపిన వివరాల ప్రకా రం.. నంబాల గ్రామానికి చెందిన సుల్వ శ్రీనివాస్-మల్లీశ్వరి దంపతుల పెద్ద కుమారుడు రిషి కాళ్ల తిమ్మిర్లతో బాధపడున్నాడు. రిషి తల్లిదండ్రులు పాసిగాం గ్రామ శివారులో గల ఆశ్రమానికి 2020 అక్టోబర్‌లో తీసుకెళ్లి నాటు వైద్యం చేయించారు. ఈ క్రమంలో కొన్ని రోజులపాటు తీసుకురావాలని వైద్యుడు బామినే భీంరావు సూచించడంతో రెగ్యూలర్‌గా తీసుకెళ్లారు. అనంతరం వైద్యం చేస్తూ అక్కడే ఉంచుకున్నాడు.
వైద్యం చేస్తూనే మల్లీశ్వరిపై కన్నేసిన భీంరావు బాలుడిని చిత్రహింసలకు గురి చేసేవాడు. ఈ విషయాలను భర్తకు చెప్పినప్పటికీ పట్టించుకోకుండా అక్కడే వైద్యం చేయించాడు. బాలుడికి నాటు వైద్యం వికటించి 2020 నవంబర్‌లో మృతిచెందాడు. ఈ విషయం బయటకు వస్తే ఆశ్రమానికి చెడ్డ పేరు వస్తుందని బాలుడి మృతదేహాన్ని ఆశ్రమం వెనుక పాతిపెట్టారు. భీంరావు మాయలో ఉన్న బాలుడి తండ్రి శ్రీనివాస్ కూడా సహకరించాడు. మల్లీశ్వరి కొడుకు విషయం చాలా సార్లు భర్తను అడిగినప్పటికీ దాట వేస్తూ వచ్చాడు. అనుమానం వచ్చిన మల్లీశ్వరి తాజాగా రెబ్బెన పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు భీంరావు, శ్రీనివాస్‌ను విచారించగా బాలుడి మృతదేహాన్ని ఆశ్రమం వెనుక పాతిపెట్టిన విషయాన్ని ఒప్పుకున్నారు.
దీంతో గురువారం వారిద్దరిని ఘటన స్థలానికి తీసుకెళ్లి తహసీల్దార్ జ్యోత్స్న ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో తవ్వకాలు జరుపగా.. బాలుడి అస్తికలు బయట పడ్డాయి. ఈ మేరకు ఇరువురిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పర్చారు. ఫోరెన్సిక్ వైద్య నిపుణుడు సురేందర్‌రెడ్డి అస్తికలు సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. అస్తికలను డీఎన్ఏ టెస్టుకు పంపిస్తామన్నారు. డీఎన్ఏ, ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పర్చామని తెలిపారు.