కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ రేంజ్ పరిధితో పాటు కాగజ్‌నగర్ మండలం కోసిని డ్యామ్ వద్ద శనివారం మూడో బర్డ్‌వాక్ ఫెస్టివల్ నిర్వహించగా, పక్షి ప్రేమికులు తరలివచ్చారు. పెంచికల్పేట్ మండలంలోని బొకి వాగు, ఉచ్చ మల్లివాగు, నందిగాం పాలరాపు గుట్ట, గుండె పల్లి బేస్ క్యాంప్, కొండెంగలొద్ది, బోలుమెత్తం తదితర ప్రాంతాలను సందర్శించి అరుదైన పక్షులను తమ కెమెరాల్లో బంధించారు. ఇక కోసిని డ్యామ్ వద్ద పక్షులతో పాటు ప్రకృతి అందాలను తిలకించేందుకు దాదాపు 35 మంది ప్రకృతి ప్రేమికులు వచ్చారు.
ఆయాచోట్ల ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఎఫ్‌డీవో సుశాంత్ సుఖ్ దేవ్ బోబడే, ఎఫ్ఆర్వో అనిల్‌కుమార్, తదితర అధికారులు పాల్గొన్నారు. ఆదివారం మధ్యాహ్నం బర్డ్‌వాక్ ఫెస్టివల్ ముగుస్తుందని అధికారులు తెలిపారు. కాగా, గతంలో కాగజ్‌నగర్ అటవీ డివిజన్ పరిధిలో 248 రకాల పక్షులను గుర్తించగా.. తాజాగా మరో 35 రకాల పక్షి జాతులను గుర్తించారు.
– కుమ్రం భీం ఆసిఫాబాద్(నమస్తే తెలంగాణ)/పెంచికల్ పేట్/కాగజ్‌నగర్, జనవరి 18