కడెం, డిసెంబర్ 18 : కడెం ప్రాజెక్టు ఆయకట్టు రైతాంగానికి యాసంగి సాగు కోసం నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భుక్యా జాన్సన్ నాయక్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన కడెం, దస్తురాబాద్, జన్నారం మండలాలకు చెందిన రైతులతో కలిసి ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులో ప్రస్తుత నీటి పరిస్థితిని సమీక్షించిన అనంతరం ర్యాలీగా నీటి పారుదలశాఖ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం ఆయకట్టు అధికారులతో మాట్లాడి వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. సెప్టెంబర్‌లో కోతలు పూర్తి చేసిన రైతులకు యా సంగి పంట గురించి ప్రభుత్వం, నీటి పారుదలశాఖ అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో రెం డో పంట విషయమై సందిగ్ధంలో ఉన్నారని అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా కడెం, దస్తురాబాద్, జన్నారం మండలాల పరిధిలోని డిస్ట్రిబ్యూటరీ-33 వరకు సా గు నీటిని అందించాలని డిమాండ్ చేశారు. రెండో పంట విషయమై నవంబర్లోనే రైతులతో సమావేశం నిర్వహించి, పంటకు వారబందీ పద్ధతిన ఇవ్వాల్సి ఉండగా, నేటికి స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంపై రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
డిసెంబర్ ముగుస్తున్నా నేటికి అధికారులు సమావేశం ఏర్పాటు చేయక, నీటి విడుదలపై స్పష్టత ఇవ్వకపోవడం సరికాదని అన్నారు. ఇకనైన అధికారులు రైతులతో సమావేశం నిర్వహించి రెండో పంటకు నీటిని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కడెం మండల అధ్యక్షుడు నల్ల జీవన్‌రెడ్డి, జిల్లా నాయకుడు భుక్యా బాపురావు, జిల్లా కో-ఆప్షన్ సభ్యుడు రఫీక్ హైమద్ పాల్గొన్నారు.